ప్రాజెక్టుల పూడికతీతకు మరో ఛాన్స్

  • టెండర్ల గడువు పెంపు.. ఈ నెల 27 వరకు దాఖలుకు అవకాశం
  • టన్ను పూడిక ధర ఇప్పటికే ఖరారు
  • పైలట్ ప్రాజెక్ట్​గా మూడు ప్రాజెక్టుల ఎంపిక
  • ప్రాసెసింగ్ యూనిట్ కోసం కడెంలో స్థల సేకరణ పూర్తి

నిర్మల్, వెలుగు: మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు కడెం ప్రాజెక్టుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్న పూడిక తొలగింపు ప్రక్రియకు సంబంధించిన టెండర్ల గడువును ఈనెల 27 వరకు పెంచారు. ఈ నెల 4 నుంచి 21 తేదీ వరకు టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు ఇరిగేషన్ శాఖ  మొదట నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ సవరిస్తూ ఈ నెల 12 నుంచి 27 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. టన్ను పూడికకు రూ.4 వేలకుపైగా ధరను ఖరారు చేసి టెండర్ నోటిఫికేషన్​ను రూపొందించింది. 

కడెంలో 3 టీఎంసీల పూడిక

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న పూడిక తొలగింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులను పైలట్ ప్రాజెక్టుల కింద ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో నీటిమట్టంలో సగం వరకు పూడిక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కడెం ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 7.630 టీఎంసీలు కాగా.. దాదాపు 3 టీఎంసీల వరకు పూడిక ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 

ఈ ప్రాజెక్టు కింద 63 000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు సగం భూములకు కూడా నీరందడం లేదు. పూడిక కారణంగా నీటి నిల్వల లెక్కలు గతితప్పుతుండడంతో ప్రతి రబీ సీజన్ లో పంటలకు సాగు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్లోని పూడికపై దృష్టి సారించింది. పూడికతీతతో రిజర్వాయర్​లో నీటి మట్టం పెరిగి చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందే అవకాశం ఉంది.

వాణిజ్య అవసరాలకు ఉపయోగించేలా..

ఈ ప్రాజెక్టుల నుంచి తీసిన  పూడికను వృథా కానివ్వకుండా  సద్వినియోగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ పూడికను ప్రాసెసింగ్ చేసి ఇసుక, మట్టిగా వేరు చేసి వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలని తలపెట్టింది. వేరు చేసిన ఇసుకను వాణిజ్య అవసరాలకు అమ్మడం, మట్టిని పంట పొలాలకు ఉపయోగించడం లాంటి చర్యలు తీసుకోబోతోంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి నిర్వహణను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల నుండి టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 27 వరకు ఈ టెండర్లకు చివరి గడువు ముగియనుంది. టెంటర్లు చేపట్టే ఏజెన్సీలు రిజర్వాయర్లలోని నీటి నిల్వలు తగ్గిపోగానే పూడికతీత పనులను మొదలు పెట్టే అవకాశాలున్నాయి.

100 ఎకరాల స్థల సేకరణ

కడెం ప్రాజెక్టు నుంచి వెలికి తీసే పూడికను ప్రాసెసింగ్ చేసేందుకు ఏర్పాటు చేయబోయే యూనిట్ కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. సర్వే నివేదికలను ప్రభుత్వానికి అందించారు. కడం ప్రాజెక్టు పరిధిలో మొత్తం 100 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. కడెం మండలంలోని ఎర్వచింతలలో 80 ఎకరాలు, రేవోజిపేటలో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇందులో నుంచి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 20 ఎకరాలు కేటాయించి మిగతా 80 ఎకరాల స్థలాన్ని స్టాక్ పాయింట్ కోసం వినియోగించనున్నారు.