కొత్తగూడెం మున్సిపాలిటీలో టెండర్ల లొల్లి!

  • రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
  • 60 మంది కాంట్రాక్టర్ల మధ్య పోటాపోటీ 
  •  సిండికేట్​చేసేందుకు ప్రయత్నం.. బెడిసికొట్టిన ప్లాన్​
  •  మున్సిపల్​ఆఫీసర్లపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి!
  • క్యాన్సిల్​చేసిన అధికారులు.. రీ టెండర్లకు సన్నాహాలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో రూ. కోట్లలో చేపట్టే అభివృద్ధి పనులకు ఇటీవల ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. కానీ టెండర్లను ఫైనల్​ చేసే టైంలో రద్దు చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు అయోమయానికి గురవుతున్నారు. కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు రావడం, కొందరు పెద్దలు కాంట్రాక్టర్లను సిండికేట్​ చేసేందుకు చేసిన యత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో ప్రజాప్రతినిధులు ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువచ్చి టెండర్లను క్యాన్సల్​ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రీ టెండర్లకు సన్నాహాలు చేపట్టారు. 

ఇదీ పరిస్థితి..

కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇటీవల రూ. 10కోట్లవిలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించి మున్సిపల్​ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. కొత్తగూడెం, పాల్వంచ కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు.ఎన్నడూ లేని విధంగా పలు పనులకు 10 నుంచి 21 వరకు టెండర్లు వచ్చాయి. దాదాపు 60 మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడం మున్సిపాలిటీలో ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. టెండర్లు వేసిన వారిలో ఎక్కువ మంది పోటీలో భాగంగా 23 శాతం వరకు లెస్​కు టెండర్లు వేశారు. ఈ నెల మొదటి వారంలో టెండర్లు ఓపెన్​ చేసి ఫైనల్​ చేయాల్సి ఉంది. 

కాంట్రాక్టర్ల మధ్య విభేదాలను కొందరు ఓ నేత దృష్టికి తీసుకువచ్చారు. ఆ నేత కాంట్రాక్టర్లను సిండికేట్​ చేసేందుకు మీటింగ్​పెట్టారు. సిండికేట్​అయ్యేందుకు కొందరు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల రద్దుకు ప్లాన్​ చేశారు. ఇదే క్రమంలో కొందరు నాయకులు మున్సిపల్​కమిషనర్​పై ఒత్తిడి తీసుకురావడంతో టెక్నికల్​ప్రాబ్లమ్స్​ అంటూ ఈ నెల 6న టెండర్లను రద్దు చేశారు. టెండర్లను రీ కాల్​చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే టెండర్ల రద్దు అన్యాయమని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 

ఆఫీసర్ల తీరుపై అసహనం..

పాల్వంచకు చెందిన కొందరు కాంట్రాక్టర్లు బినామీల పేర టెండర్లు వేస్తున్నారంటూ కొత్తగూడెంకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఆఫీసర్లు కంప్లైంట్​ చేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో టెండర్లు వేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికి, ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి టెండర్లు ఇస్తున్నారంటూ పలువురు కాంట్రాక్టర్లు ఆఫీసర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్​ టర్నోవర్​ ఏడాదికి రూ. కోటి ఉండగా రూ. 10కోట్లు చూపించడంతో ఆఫీసర్లు ఆ కాంట్రాక్టర్​తో మిలాఖత్​ అయి డాక్యుమెంట్లను సరిగా పరిశీలించకుండానే టెండర్​ ఫైనల్​ చేశారనే ఆరోపణలు వచ్చాయి. 

ప్రస్తుత టెండర్లలోనూ అదే విధంగా కొందరు టెండర్లు వేస్తున్నారంటూ కమిషనర్​కు పలువురు కంప్లైంట్​ఇచ్చారు. బాక్స్​లో నుంచి టెండర్లు ఓపెన్​ చేసిన ఆఫీసర్లు కాంట్రాక్టర్ల పేర్లను చదివిన తర్వాత టెండర్లను రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆఫీసర్ల తీరుపై పలువురు మండిపడుతున్నారు. 

పాల్వంచ మున్సిపాలిటీలో రూ.8కోట్ల పనులు...

ఇదిలా ఉండగాపాల్వంచ మున్సిపాలిటీలో దాదాపు రూ. 8కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఇటీవల ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. రిజర్వేషన్ల విషయంలో కొంత తప్పు జరిగిందని భావించి ఆఫీసర్లు టెండర్లను రద్దు చేశారు. త్వరలో మరో సారి టెండర్లను పిలువనున్నారు. 

టెక్నికల్​ప్రాబ్లమ్స్​తోనే రద్దు చేశాం 

కొత్తగూడెం మున్సిపాలిటీలో టెండర్లను టెక్నికల్​ప్రాబ్లమ్స్​మూలంగా రద్దు చేయాల్సి వచ్చింది. కాంట్రాక్టర్ల వద్ద నుంచి వచ్చిన కొన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఆలోచనతోనే టెండర్లను రద్దు చేశాం. టెండర్లను రీ కాల్​ చేశాం.  - టి. శేషాంజన్​ స్వామి, మున్సిపల్​కమిషనర్, కొత్తగూడెం మున్సిపాలిటీ