పద్మశాలీ సంఘం అధ్యక్షుడి ఎన్నికలో ఉద్రిక్తత

పద్మశాలీ సంఘం అధ్యక్షుడి ఎన్నికలో ఉద్రిక్తత

శాయంపేట, వెలుగు: పద్మశాలీ మండలాధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలాధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో సమావేశమయ్యారు. మండల కేంద్రానికి చెందిన వంగరి సాంబయ్య, కొప్పుల గ్రామానికి చెందిన సామల మధుసూదన్ పోటీలో నిలిచారు. జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు యాదగిరి ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేయగా, కుదరలేదు. 

ఈ క్రమంలో మండలంలో 13 గ్రామాల్లో పద్మశాలీ గ్రామ కమిటీల్లో ఐదుగురు చొప్పున సభ్యులు ఓటింగ్​లో పాల్గొనాలని నిర్ణయించి, ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. దీంతో అప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని సాంబయ్య వర్గం సభ్యులు బ్యాలెట్​ బాక్స్​ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సభ్యులను శాంతింపజేశారు. కాగా, మండల అధ్యక్షుడిగా సామల మధుసూదన్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య అధికారికంగా ప్రకటించారు. మధుసూదన్ వర్గీయులు సొసైటీ నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.