
అమెరికాలో ఎప్పటినుంచో దిగ్గజ కార్ల కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ కార్ మార్కెట్‌ని ఫోర్డ్, హోండా, చేవ్రొలెట్ లాంటి కంపెనీలు ఏలుతున్నాయి. అలాంటి టైంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మోటార్స్ స్థాపించారు. దాని సీఈవో ఎలాన్ మస్క్ ఆ కంపెనీని ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాప్‌లో నిలబెట్టగలిగాడు. ఈ కంపెనీని 2003లో ఇంజనీర్లు మార్టిన్ ఎబర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్‌లు స్థాపించారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ ఇందులో భారీగా పెట్టుబడి పెట్టాడు. వాస్తవానికి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లను డెవలప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
టెస్లాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎబెర్‌హార్డ్ ఉండేవాడు. ఆయన కంపెనీ పెట్టిన ఏడాదికి పెట్టుబడుల కోసం ప్రయత్నించాడు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లు బాగా డెవలప్ అవుతాయని బలంగా నమ్మిన మస్క్ 30 మిలియన్ల డాలర్లకుపైగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. దాంతో 2004లో ఈ కంపెనీకి చైర్మన్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగేండ్లు కష్టపడి 2008లో టెస్లా మోటార్స్ తన మొదటి కారును విడుదల చేసింది. దాని పేరు రోడ్‌స్టర్. కంపెనీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఒకే ఛార్జ్‌పై 245 మైళ్లు (394 కిమీ) నడిచింది. కానీ రోడ్‌స్టర్‌ను కొన్నవాళ్లు చేసిన టెస్ట్‌లో మైలేజ్ చాలావరకు తగ్గింది. అందుకే ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. పైగా కంపెనీకి చాలా నష్టాలు వచ్చాయి. దాంతో 2007 చివరలో ఎబెర్‌హార్డ్ తన సీఈవో, టెక్నాలజీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కంపెనీ సలహా బోర్డులో చేరాడు. తర్వాత 2008లో కంపెనీని వదిలి వెళ్లిపోయాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టార్పెనింగ్ కూడా 2008లో కంపెనీని విడిచిపెట్టాడు. దాంతో మస్క్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాడు.
మస్క్ మార్క్
కంపెనీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మస్క్ సీఈవో అయ్యాడు. అప్పటికి కంపెనీ పెట్టి ఐదేండ్లు అవుతున్నా సక్సెస్ మాత్రం రాలేదు. తయారుచేసిన ఒక్క కారు కూడా ఫెయిల్ అయ్యింది. అందుకే మస్క్ 2012లో టెస్లా రోడ్‌స్టర్ ప్రొడక్షన్ ఆపేశాడు. అదే సంవత్సరంలో మోడల్ ఎస్‌ని రిలీజ్ చేశాడు. దీని కోసం మస్క్ ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇది మూడు వేర్వేరు బ్యాటరీ ఎంపికలతో వచ్చింది. ఇది నాలుగు సెకన్లలో 0 నుండి 60 మైళ్ల (96 కి.మీ) వేగాన్ని అందుకుంది. రోడ్‌స్టర్‌లో బ్యాటరీలు వెనుక భాగంలో ఉండేవి. మోడల్ ఎస్‌లో దాని ఫ్లోర్ కింద పెట్టారు. దాంతో ఎక్స్‌ట్రా బూట్ స్పేస్ వచ్చింది. పైగా గురుత్వాకర్షణ ఎఫెక్ట్ తక్కువగా ఉండడంతో వేగం పెరుగుతుంది. ఈ కారుని ఆటోమోటివ్ విమర్శకులు ప్రశంసించారు.
సూపర్ ఛార్జర్స్
మస్క్ 2012 నుండి టెస్లా కార్లను ఛార్జ్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో సూపర్‌ఛార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేయించాడు. దాంతో కారుని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చనే నమ్మకం కలిగింది. అందుకే కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత టెస్లా నుంచి మోడల్ ఎక్స్ వచ్చింది. ఇది కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 340 మైళ్లు (547 కిమీ) వెళ్తుంది. ఆ తర్వాత వచ్చిన మోడల్ –3 కూడా సక్సెస్ అయ్యింది.
క్వాలిటీ ముఖ్యం
మస్క్ టెస్లా సీఈవో అయిన తర్వాత కారుకు వాడే ప్రతి వస్తువుని క్వాలిటీగా తయారుచేయించాడు. అందుకే ఇది అనేక క్వాలిటీ టెస్ట్‌ల్లో పాస్ అయ్యింది. పైగా కంపెనీ ఎప్పుడూ కస్టమర్ సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తుంటుంది. కన్జూమర్ రిపోర్ట్స్ సంస్థ టెస్ట్ చేసినప్పుడు సేఫ్టీలో బెస్ట్ కారుగా నిలిచింది. పైగా కంపెనీ రిలీజ్ చేసిన ప్రతి కారులో ఏదో ఒక కొత్త టెక్నాలజీని ఇన్‌బిల్ట్‌గా ఇస్తుంది. అంతెందుకు ప్రపంచంలో అన్ని కార్లతో పోలిస్తే.. టెస్లాలో ఉండే సెల్ఫ్ డ్రైవ్ సిస్టమ్ చాలా ఫర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని చాలామంది కస్టమర్లు చెప్తుంటారు.