
- రిక్రూట్‌మెంట్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన తెలుగు స్క్రైబ్‌పై పరువు నష్టం దావా: టీజీపీఎస్సీ
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌పై కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సూచించింది. గ్రూప్ 1 సెలక్షన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయ్నతిస్తున్నామని తెలిపింది. త్వరలోనే జీఆర్ఎల్ లిస్టును వెబ్‌సైట్‌లో పెడ్తామని చెప్పింది.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. గ్రూప్-1 పోస్టులను రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని ‘తెలుగు స్క్రైబ్’ డిజిటల్ చానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై టీజీపీఎస్సీ సీరియస్ అయింది. దీంతో ఆ చానల్‌పై క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించామని కమిషన్ ఇన్‌చార్జి సెక్రటరీ సుమతి తెలిపారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ డీసీపీకి, బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.