- సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
- టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వెంకన్న డిమాండ్
ముషీరాబాద్,వెలుగు: గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ గెజిట్ విడుదల చేసి, తర్వాత పట్టించుకోలేదని టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఈదురు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా విలీన హామీని నెరవేర్చాలని, సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, అన్ని ఖాళీల భర్తీ, పనిభారం తగ్గింపు,2021 వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చలో బస్‌భవన్ చేపట్టారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జాప్యం జరుగుతోందన్నారు. యాజమాన్యానికి ఎంత మొరపెట్టుకున్నా స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎస్.బాబు, కమలాకర్ గౌడ్, బాలరాజ్, ఎండీ మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బి.యాదగిరి, రాములు, శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.