
ఇందిరా అనే 16 ఏళ్ల యువతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 11 గంటల వరకు చదువుతోనే గడుపుతోంది. ప్రతివారం పరీక్షలు, ప్రతినెల ర్యాంకింగ్, ప్రతి మూమెంటు మోటివేషన్. తక్కువ మార్కులొస్తే తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆగ్రహం, స్నేహితులు దూరం. చివరికి ఒకరోజు ఒత్తిడిని అధిగమించలేక ఆమె జీవితాన్ని ముగించుకున్నది. ఈ కథనం ఊహాజనితం కాదు. మనదేశంలో రోజుకు కనీసం 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న గణాంకం (NCRB, 2022) వెల్లడిస్తోంది. ఈ సంఖ్య 2010తో పోల్చితే దాదాపు 70% పెరిగింది. విద్యా ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, నిర్దాక్షిణ్యమైన ర్యాంకింగ్ వ్యవస్థలు ఇవన్నీ పిల్లలను నెమ్మదిగా మానసికంగా నిర్వీర్యం చేస్తున్నాయి.
ప్రస్తుత భారత విద్యా వ్యవస్థ విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పుల స్థాపనకు మద్దతు ఇవ్వాలి. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి, పోటీ వారిని మానసిక కుంగుబాటుకు దారితీస్తోంది. మన విద్యా విధానం కేవలం మార్కులు, డిగ్రీలు, ఎంట్రన్స్ పరీక్షల ర్యాంకుల మీదే ఆధారపడి ఉంది. పోటీ, ఒత్తిడి మాత్రమే కాకుండా వారికి వ్యక్తిగత స్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే దానిపై అవగాహన ఉండటం లేదు. ఈ చదువుల యుద్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కేవలం విజయాన్ని మాత్రమే లక్ష్యంగా చూస్తున్నారు, ఈ విధానం విద్యార్థులను వ్యక్తిగత అభివృద్ధిని మరిచిపోయేలా చేసి వారిని కేవలం ఉత్తమ మార్కులు సాధించడంలో గుణాత్మకంగా మార్చేసింది. అందుకే, మన విద్యా విధానాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
నాణ్యమైన విద్య కాదు..ర్యాంకులే ప్రధానమా?
మన విద్యా వ్యవస్థలో ప్రధాన లక్ష్యం అత్యధిక మార్కులు సాధించడం. ఓ విద్యార్థి మేధస్సు కంటే అతను ఎన్ని ప్రశ్నలు జ్ఞాపకం పెట్టుకున్నాడో, ఎంత వేగంగా రాయగలడనే దానిపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసం కంటే గుడ్డిగా చేసే రివిజన్ ముఖ్యమవుతున్నది. ఇంతవరకు ‘విద్య అనేది జ్ఞానం’ అన్న సిద్ధాంతం ఉంటే ఇప్పుడు ‘విద్య అనేది ర్యాంక్ సాధన’గా మారిపోయింది. యూనివర్సిటీలు, కార్పొరేట్ ఉద్యోగాలు కూడా విద్యార్థులను వారి మార్కుల ఆధారంగా మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
పిల్లల అభివృద్ధి పేరుతో వారి భవిష్యత్తును వాణిజ్యంగా ఉపయోగించుకునే ప్రయత్నాలివి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అసలు లక్ష్యాన్ని మరచిపోయింది. రోజుకు 12-–14 గంటల తరగతులు, ప్రతివారం గ్రాండ్ టెస్టులు, సెల్ ఫోన్ నిషేధం, గాలి సోకని హాస్టళ్లు, చివరికి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే సమయం ఇవ్వకుండా చేస్తున్న విధానం లేత మనసుల ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా పేరున్న ప్రైవేట్ విద్యాసంస్థల పాత్ర ప్రస్తావనకురావాల్సిందే. కొన్ని సంస్థలు విద్యార్థులను రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపుల్లా నిర్వహిస్తున్నాయి.
తల్లిదండ్రుల కలలు.. పిల్లలపై భారం
పిల్లలపై తల్లిదండ్రుల కలల బరువు అమితంగా పెరుగుతోంది. ఓ పక్కన ప్రేమగా వారు కనిపించినా వాళ్ల అంచనాలు పిల్లలపై ఒత్తిడిని విపరీతంగా పెంచుతున్నాయి. అదే మా ఆశ అనే తత్వం పిల్లలకు భావోద్వేగ బరువుగా మారుతోంది. ప్రతి విజయానికి మెచ్చుకోలు, విఫలమైతే తిట్లు..ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. మన తల్లిదండ్రుల సామాజిక దృక్ఫథం మారాలి. విజయం అనేది మార్కులలో కాదు, జీవితాన్ని సంతృప్తిగా జీవించడంలో ఉంది. మన విద్యా వ్యవస్థ ఈ మార్గంలో పయనించాలి. తల్లిదండ్రులు, పాలకులు, మనమందరం కలసి పిల్లల కోసం ఒక అనురాగ దారి చూపాలి. వాళ్ల స్వప్నాలకు అడ్డుకాని విద్యా
వ్యవస్థను నిర్మిద్దాం.
పరిష్కార సూచనలు
మానసిక ఆరోగ్యాన్ని విద్యలో భాగంగా చేర్చాలి. ప్రతి పాఠశాలలో ట్రైన్డ్ కౌన్సెలర్స్ ఉండాలి. పరీక్షల ఆధారిత వ్యవస్థను సవరించాలి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఓపెన్ బుక్ ఎగ్జామ్స్లాంటి మార్గాలు పరిశీలించాలి. పిల్లలపై నిర్దాక్షిణ్యమైన అంచనాలను తగ్గించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం. విద్యా వ్యాపారీకరణను నియంత్రించాలి. జాతీయ విద్యా విధానాన్ని (NEP) అమలు చేయడంలో మానసిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- డాక్టర్. బి.కేశవులు, ఎం.డి. సైకియాట్రీ