తిరుపతి: శ్రీవారు స్నానం చేసిన నామాల కాలవ దగ్గర పురాతన విగ్రహం బయటపడింది. రామచంద్రాపురం మండలం నడవలూరు నెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న శ్రీవారు స్నానం చేసిన నామాలు ధరించిన కాలవ దగ్గర ఉన్న పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం పైన స్వామి వారి పాదాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత సతీసమేతంగా తిరుమలకు బయల్దేరతారు. ఈ క్రమంలో రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ కొత్త నెన్నూరు దగ్గర ఉన్న కాలువలో స్నానం చేసి నామాలు పెట్టుకున్నట్లు తిరుమల చరిత్ర చెబుతుంది. అందుకనే ఈ కాలువను నాం కాలువగా, నామాల కాలువ అని పిలుస్తుంటారు.
ALSO READ | ఏపీకి ఏమిచ్చారు..?: కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డ మాజీ మంత్రి బొత్స
మౌని అమావాస్య రోజున ఈ కాలువలో భక్తులు భక్తి ప్రపత్తులతో పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న కాలువ దగ్గరలో పురాతన విగ్రహం బయటపడటం, ఆ విగ్రహంపై స్వామి వారి పాదాలు కనిపించడంతో భక్తులు ఆ పాదాలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.