ఎన్నాళ్లకెన్నాళ్లకు! మందమర్రిలో డబుల్​ఇండ్ల కేటాయింపు

ఎన్నాళ్లకెన్నాళ్లకు! మందమర్రిలో డబుల్​ఇండ్ల కేటాయింపు
  • నాలుగేండ్ల తర్వాత తీరిన పేదల సొంతింటి కల
  • లక్కీ డ్రా పద్ధతిలో 243 మందికి కేటాయించిన ఆఫీసర్లు 
  • ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు

కోల్​బెల్ట్, వెలుగు: సొంతింటి కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదల కల ఎట్టకేలకు తీరింది. మందమర్రిలో నిర్మించిన డబుల్ ​బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి ఆదేశాలతో ఎట్టకేలకు లబ్ధిదారులకు కేటాయించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి డబుల్​ బెడ్రూం ఇండ్లు కేటాయించామని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ ​రావు అన్నారు. బుధవారం మందమర్రి సింగరేణి సీఈఆర్​ క్లబ్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాటరీ పద్ధతిలో 243 మంది లబ్ధిదారులకు ‘డబుల్’​ ఇండ్ల కేటాయించారు.

ఆర్డీవో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో ఇండ్ల కేటాయింపు కార్యక్రమం చేపట్టమన్నారు. మొదటి దఫాలో 243 మంది లబ్ధిదారులకు కోసం  సింగరేణి హైస్కూల్​కు చెందిన ఇద్దరు విద్యార్థినులతో లక్కీ డ్రా తీసి అధికారికంగా ప్రకటించారు. రెండో దఫాలో మరో 243 ఇండ్లు ఇస్తామని తెలిపారు. త్వరలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ అందజేస్తామని చెప్పారు. 

Also Read :- ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు రద్దు?

కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ సతీశ్​కుమార్, మున్సిపల్​ కమిషనర్​ వెంకటేశ్వర్లు, హౌజింగ్​ శాఖ పీడీ బన్సీలాల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయితే స్థానికులు కొందరు తాము అర్హులమైనా తమ పేర్లను తొలగించారంటూ ఆఫీసర్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.  

నాలుగేండ్ల తర్వాత కేటాయింపు

మందమర్రి పట్టణం పాలచెట్టు ప్రాంతంలో 560 డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టగా నాలుగేండ్ల క్రితం 400 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి కోసం 2023 ఫిబ్రవరిలో సుమారు 5 వేల మంది దరఖాస్తు చేసుకోగా 521 మంది అర్హులంటూ లిస్టు ప్రకటించారు. ఎట్టకేలకు మూడు రోజుల క్రితం 253 మందితో కూడిన మొదటి దఫా అర్హుల లిస్టును ఆఫీసర్లు రిలీజ్ చేశారు. ఇందులో అనర్హులకు కూడా చోటు కల్పించారని, వారిని తొలగించి అర్హులకు కేటాయించాలంటూ రాజకీయ పార్టీల నేతలు, ఇతర సంఘాలు రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. 

ఇండ్ల కేటాయింపు జరగకుండా చూస్తామంటూ చెప్పడంతో  బుధవారం మందమర్రి సింగరేణి సీఈఆర్​ క్లబ్​లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​రెడ్డి నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. లక్కీ డ్రా తీసే సీఈఆర్​క్లబ్​లోకి లబ్ధిదారులు, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించారు.