పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలనే లక్ష్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం ఆహ్వానించదగిన పరిణామం. ఇందుకోసం జూన్ 26 నుంచి జులై నెల చివర వరకు ప్రత్యేక కార్యక్రమం అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పఠనమనేది పాఠశాల స్థాయిలో విద్యార్థులు సాధించాల్సిన నాలుగు ప్రధాన సామర్థ్యాల్లో ఒకటి. నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం కొరవడిందనేది నిస్సందేహం. జూన్ 2 నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, ఆపై పఠనోత్సవాలు, మలి విడత బడిబాట ఉత్సవాలు, కొనసాగుతున్న ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమం.. ఇవన్నీ విద్యార్థులకు ఉపయుక్తమే.
కానీ ఇవి మరో వైపు బడుల్లో టీచర్లను, హెచ్ఎంలను బోధనకు దూరం చేస్తున్నాయి. బడి ప్రారంభంలో తరగతుల నిర్వహణలో సీరియస్నెస్ లోపించేందుకు, బోధనను కుంటుపర్చేందుకు కారణమవుతున్న వీటి నిర్వహణకు ప్రత్యామ్నాయం వెతకకుంటే సర్కార్ బడుల్లో సదువులు ఆగస్టు చివర వరకూ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.
ఏమిటీ పఠనోత్సవాలు
విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి, చదవటం అలవాటుగా మారాలి, చదవటం ఆనందంగా మారాలి, విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల స్థాయిలో ఈ కార్యక్రమం రూపొందించింది. బడి టైం టేబుల్ లో రోజూ ఒక పీరియడ్ ను బుక్స్చదివేందుకు కేటాయించాలని, అన్ని పీరియడ్లలో మొదట పదినిమిషాలు సబ్జెక్ట్ ను బాహ్యపఠనం చేయించాలనేవి నిబంధనలు. పిల్లలతో గ్రంథాలయ కమిటీలు వేయాలని, రోజు వారీ ప్రార్థన సమయాల్లో కూడా పఠనం చేయించాలి. ఇందులో భాగంగా జులై10 నుంచి17 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలని, ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, సమీక్షలు సిద్ధంచేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
గత కార్యక్రమాల సమీక్షలేమయ్యాయి?
తెలంగాణ పాఠశాలలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో వివిధ అభ్యసన సామర్థ్యాల అభివృద్ధికి సర్వ శిక్షా అభియాన్, సమగ్ర శిక్షా అభియాన్ లు పాఠశాలల్లో అమలు చేసిన పలు కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పలు పేర్లతో నిర్వహించిన విభిన్న విద్యా శిక్షణా తరగతులు, పాఠ్యగ్రంథాల్లో మార్పులు, మాడ్యుల్ ప్రచురణలు వాటి ఫలితాలు, ఆ ఫలితాలపై సమీక్షలు వాటి సాఫల్యాలు, వైఫల్యాలు ఎప్పుడూ ప్రభుత్వం చూడలేదు.ఈ కార్యక్రమాల కోసం వెచ్చించిన నిధులు సహా మొత్తంపై ప్రభుత్వం, విద్యాశాఖ సింహావలోకనం చేసుకోవల్సి ఉంది.
విద్యార్థుల్లో వివిధ విషయాల్లో సంబంధిత సామర్థ్యాలు సాధించటం కోసం అపెప్, ఆపై డిపెప్ నిర్వహించిన క్లిప్, క్లాప్, లెప్ నుంచి నిరుడు నిర్వహించిన తొలిమెట్టు , ఎఫ్ఎల్ఎన్ వరకు అన్నిటినీ పక్కా ప్రణాళికలు, కార్యాచరణతో నిర్వహించారు. మరి ఏటా ఓ కొత్త పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల పూర్తి అనంతరం ఎలాంటి సమీక్షలు నిర్వహించారు? వాటితో ఫలితాలు వచ్చాయా? లేదా అని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదంటే వృథా ప్రయాస, నిధుల ఖర్చు తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు.
సర్కారుకు చిత్తశుద్ధి ఉందా!
ఉమ్మడి తెలుగురాష్ట్రాల గత రెండున్నర దశాబ్దాల్లో పాఠశాల విద్యారంగాన్ని సమాజం ముందు దోషిగా చూపేందుకు, సమాజానికి ప్రభుత్వ బడిని దూరం చేసేందుకు, ప్రభుత్వ బడుల్లో రాజకీయ పక్షాల పరోక్ష ప్రవేశానికి దోహదపడే ప్రభుత్వ విద్యారంగ విధ్వంసక కార్యకలాపాలు కొనసాగాయి. ఆకాంక్షల తెలంగాణలో విద్యారంగం బాగుపడుతుందనుకున్న ఆశలు నిరాశలయ్యాయి. ఈ తొమ్మిదేండ్ల కాలంలో విద్యారంగం అభివృద్ధి పేరిట విధ్వంసానికి గురై నేడు పూర్తిగా అదృశ్యమయ్యే స్థాయికి చేరువవుతోంది. వేలాది ప్రభుత్వ బడుల మూతపడటం, బోధనా, బోధనేతర సిబ్బంది నియామకాలు లేకపోవటం, విద్య పూర్తిగా ప్రైవేటుపరం కావటం, విద్యాభివృద్ధికి ప్రభుత్వానికి అసలు ఒక విజన్ అనేది లేకపోవటంతో ప్రభుత్వ విద్యారంగం మృత్యుశయ్యపై కొన ఊపిరితో ఉన్నది. 2014 విద్యాసంవత్సరంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో విద్యారంగానికి ప్రభుత్వం 11 శాతం నిధులు కేటాయించింది. ఆ మొత్తం ఏటా తగ్గిస్తూ గత రెండు వార్షిక బడ్జెట్ లలో 6.7 శాతం నిధులతో విద్యారంగాభివృద్ధిని కుంటుపడేస్తున్నది.
నిరంతర కార్యక్రమాలు
జూన్ 26 నుంచి జులై 31 వరకు పఠనోత్సవాలు అని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తున్నది. జూన్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బడిబాట పేరిట నిర్వహించిన కార్యక్రమానికి తాజా ప్రోగ్రామ్ను సీక్వెల్ గా ప్రకటించారు. జూన్ 26 నుంచి జులై 6 వరకు 2 వారాల పాటు మళ్లీ బడిబాట నిర్వహించనున్నారు. ఉన్నత తరగతులైన 8,9,10 తరగతులకు ఎఫ్ఎల్ఎన్ నిర్వహణకు కార్యక్రమం అమలుచేస్తూ రాష్ట్ర స్థాయి పర్యవేక్షణకు టీమ్లు సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలు ఒక వైపు నిర్వహిస్తూనే మరోవైపు పాఠశాలల్లో జులై చివరివారంలో మొదటి ఫార్మాటివ్ అస్సెస్మెంట్ నిర్వహించవల్సి ఉంటుంది. ఇన్ని వరుస కార్యక్రమాల అమలు, రోజువారి నివేదికలు సిద్ధం చేయటం బడుల్లో బోధనాభ్యసన ఉపాధ్యాయులకు గారడీ ఆటలా ఉంది. ఇవన్నీ విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలని భావించి అమలుచేయక తప్పదు. కానీ ఈ కార్యక్రమాల అమలుకు, నిర్వహణకు ప్రధానమైన ఉపాధ్యాయ సిబ్బంది పాఠశాలల్లో చాలినంత లేరనే ప్రధాన సమస్యను ప్రభుత్వం విస్మరించడం సరికాదు. టీచర్లు లేకుండా ఏ కార్యక్రమం సక్సెస్ కాదనే విషయం గుర్తించాలి.
టీచర్పోస్టుల ఖాళీలు
రాష్ట్రంలో దాదాపు 25000 ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలున్నాయి. కరోనా విపత్తు, ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీ తదితర కారణాలతో పట్టణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల నమోదు శాతం పెరుగుతున్నది. కొన్ని ప్రధాన సబ్జెక్ట్ లను బోధించేందుకు టీచర్లు లేకపోవటంపై ప్రభుత్వం దృష్టి సారించటం లేదు. నాలుగేండ్లుగా విద్యా వాలంటీర్ల పునర్నియామకం లేదు.వర్క్ అడ్జెస్ట్ మెంట్ కింద విద్యార్థుల నమోదు శాతం తక్కువ ఉన్న బడుల నుంచి ఉపాధ్యాయులను ఎక్కువ నమోదు శాతం ఉన్న బడులకు పంపిస్తున్నారు.
పైగా ఉన్న టీచర్లు తమ సబ్జెక్టుల బోధనపై దృష్టి కేంద్రీకరించకుండా విద్యార్థుల సామర్థ్యాల మెరుగుదల కోసం అంతర్గత ప్రణాళికలు తయారు చేసుకోకుండా కళ్లెం వేస్తున్నట్టు ఈ కేంద్రీకృత కార్యక్రమాలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీలను భర్తీ చేయాలి. నిరంతర కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా టీచర్లకు బోధించేందుకు సమయం ఇవ్వాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి.
అజయ్,
టీపీటీఎఫ్ ఉపాధ్యక్షుడు, వరంగల్