పాండవుల గుట్టలను పట్టించుకోరా?


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాండవుల గుట్టలు ఉన్నాయి. బౌద్ధుల ధ్యాన కేంద్రాలైన  పాండవుల గుహలు, రాతి గుట్టలు, కట్టడాలు, కోనరావుపేటలోని అడవుల్లో ఉన్న జెండగుట్ట, జాజుగుట్ట, రెండు గుట్టల సందు, నల్ల గుండ్లు, నల్లబోల్లు, పోతరాజు చెలిమ వరకు నల్ల రాతిగుట్టల కట్టడాల వరకు  బౌధ్ధ మత బిక్షువులు ఉండేవారు. ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లిందని  చరిత్రకారులు, గ్రామాల ప్రజలు, మేధావులు చెబుతారు. బౌద్ధం తర్వాత క్షత్రియులు అయిన పాండవులు ఇక్కడ అడవుల్లో  వనవాసం చేశారని అందుకే వీరి పేరుమీదే పాండవుల గుట్టగా వచ్చిందని మరికొందరు ఇక్కడి గ్రామాల ప్రజలు అయిన కోనరావుపేట, తిరుమలగిరి, వెంకటేశ్వర్లపల్లి, జూబ్లీ నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సాపురం గ్రామాల ప్రజలు, చరిత్రకారులు చెబుతున్నారు. అశోకుని కాలంలో 263 బీసీ నుంచి  బౌద్ధాన్ని ఇక్కడ ఆచరించే వారు. బుద్ధుడే స్వయంగా 5 - 6 వ శతాబ్దంలో  ఇక్కడ సందర్శించాడు..అని ఇక్కడ ప్రజల అభిప్రాయం. బౌధ్ధ బిక్షువులు ఇక్కడ ధ్యాన కేంద్రంగా ఉండేవారని, కోనరావుపేట అడవుల్లో బౌధ్ధ సంఘంలోని జ్ఞానోదయం పొందిన ధర్మ మార్గాన్ని ఆచరించే వారని ఇక్కడే అడవుల్లో నివసించే వారని ఇక్కడి గ్రామాల ప్రజలు చెబుతున్నారు. హిందూ మతం ప్రారంభం అయ్యాక బౌద్ధమతం అంతరించి పోయిందని ఇక్కడి బౌద్ధులు చనిపోయారని, కొందరు వెళ్లిపోయారని చెబుతున్నారు. హిందూ మతం ప్రారంభం అయిన తర్వాత పాండవులు వనవాసం కోసం ఇక్కడికి వచ్చారని  చెబుతున్నారు.  రాక్ పెయింటింగ్‌‌లు, రాళ్లపై చెక్కబడిన పేర్లు మానవ విజ్ఞాన పరిమానాన్ని గుర్తించే పాండవుల గుట్టల్లో సహస్రాబ్దాల నాటి రాతి చిత్రాలు సహజ రంగులోనే ఉంటాయి. ప్రకృతి అందాలు, కమనీయమైన సహజ సిద్ధమైన వాతావరణంలో శ్రీ బుగులోని  వెంకటేశ్వర స్వామి, గుట్ట పైన గరుడ దీపం, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిలో ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. దైవదర్శనానికి జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాతో పాటు, ములుగు, హన్మకొండ, వరంగల్, భక్తులు, పర్యాటకులు, అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏడాది మే చివరి వారం లేదా జూన్ మొదటి వారాల్లో వర్షాలు కురవకపోతే  ఇక్కడి చుట్టు ప్రక్కల గ్రామాలైన తిరుమలగిరి, జగ్గయ్యపేట, కోనరావుపేట, గోరి కొత్తపల్లి, నిజాంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, జూబ్లీనగర్, రామన్నగూడెం ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు కప్ప తల్లి ఊరేగింపు చేస్తారు. మొక్కులు చెల్లించడానికి పాండవుల గుట్టకు వెళ్ళడం ఇక్కడి ప్రజల విశ్వాసం. అంతే కాకుండా ములుగు జిల్లా  తాడ్వాయి మండలం ఆదివాసి కుంభమేళా అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు భారీగా భక్తులు తరలి వస్తారు. తిరుగు ప్రయాణంలో పాండవుల గుట్టలను సందర్శించి ఇక్కడే విడిది చేస్తారు.  ఆర్టీసీ బస్సులను పాండవుల గుట్ట ద్వారా నడిపించే విధంగా పర్యాటక ప్రాంత చేరువలో ఉంది. అడవుల్లో జూపార్క్ ఏర్పాటు చేసినట్లయితే వన్యప్రాణులు అంతరించి పోకుండా ఉంటాయి. ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం  గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ రామప్ప దేవాలయం - కోనరావుపేట క్రాస్ రోడ్‌‌ వరకు బాహ్య వలయంగా రోడ్డు నిర్మాణం చేపడితే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడి యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
-జానుశ్రీ, 
జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి