సూర్యాపేట, వెలుగు: హాస్టల్లో వాటర్ సంపు గోడ కూలి ఓ స్టూడెంట్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగారం మండలానికి చెందిన హాస్టల్‌ను చివ్వెంల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆర్.పవన్ (13), కె.యశ్వంత్, జె.సుశాంత్ అనే ముగ్గురు ఐదో తరగతి స్టూడెంట్స్ పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ వద్ద స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్టూడెంట్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ పవన్మృతిచెందాడు. యశ్వంత్ పరిస్థితి క్రిటికల్‌గా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. పవన్ ది మోతె మండలం అప్పన్నగూడెం అని అధికారులు తెలిపారు.
రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని
మృతిచెందిన పవన్ కుటుంబ సభ్యులకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న స్టూడెంట్స్‌ను ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. చనిపోయిన స్టూడెంట్ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేండ్లు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.
పవన్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం
ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని చనిపోయిన స్టూడెంట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన స్టూడెంట్స్‌కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లకు సూచించారు. పవన్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే, డబుల్ బెడ్రూం ఇల్లుతో పాటు కుటుంబం లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, మృతుడి సోదరికి గురుకుల పాఠశాలలో చదువుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. గాయపడిన స్టూడెంట్స్‌కు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని తెలిపారు. ఘటన పై విచారణ జరుపాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.