మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధి జిల్లా రేవా-సాత్నా సరిహద్దుల్లో అతివేగంతో వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ధాటికి బస్సు రెండు మెక్కలయింది. మరో బస్సు నుజ్జునుజ్జు అయింది. రెండు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్ మహాకుంభ్ లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని శివరాజ్ సింగ్ తెలిపారు.