భారతదేశాన్ని 150 ఏళ్లు పాలించిన బ్రిటీషోళ్లు.. పోతూపోతూ పాకిస్తాన్ ఆధిపత్యాన్ని పెంచేందుకు దేశాన్ని విభజించారు. ఇండియా లేదా పాక్‌లో చేరేందుకు రాచరిక రాష్ట్రాల పాలకులకు ప్రత్యేక హక్కులిచ్చారు. దీంతో జమ్మూకాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్.. రాష్ట్రాన్ని భారత్‌లో కలిపేస్తూ 1947 అక్టోబర్ 26న విలీనపత్రంపై సంతకం చేశారు. ఆ మర్నాడే నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ దానికి ఆమోదం తెలిపారు. తమలో కలుస్తుందని భావించిన పాకిస్థాన్‌కు అది కలగానే మిగిలిపోయింది.
నిజానికి భారత్‌లో కాశ్మీర్ కలుస్తోందని ముందే గ్రహించిన పాకిస్థాన్ కుట్రలకు తెరలేపింది. 1947 అక్టోబర్ 22న కాశ్మీర్‌పై దాడి చేసింది. భారత సైన్యం అక్కడకు చేరుకునే సమయానికి చాలా ప్రాంతాలను ఆక్రమించేసింది. అయితే, పాక్ సైన్యాన్ని తిప్పికొట్టిన భారత్.. ఆ దేశం ఆక్రమించిన అనేక ప్రాంతాలను మళ్లీ స్వాధీనం చేసుకుంది. పాక్ ఆక్రమణల వ్యవహారాన్ని 1948 డిసెంబర్ 31న నాటి మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రపంచం ఒత్తిళ్లతో నెహ్రూ అయోమయంలో చిక్కుకుపోయారు. దాని ఫలితంగా ఇప్పుడు కాశ్మీర్‌లోని చాలా భూభాగం ఇప్పుడు ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’గా మిగిలిపోయింది. మీర్పూర్, భీంబర్, కోట్లి, బాగ్, ముజఫరాబాద్, గిల్గిట్, బాల్టిస్తాన్ వంటివి ఆ ప్రాంతంలోనే ఉండిపోయాయి.
పాక్ భ్రమలు
పాకిస్థాన్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో లెఫ్టినెంట్ కర్నల్‌గా ఉన్నప్పుడు జావేద్ అబ్బాస్‌కు ‘ఇండియా- ఎ స్టడీ ప్రొఫైల్’ అనే రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను ఇచ్చింది ఆ దేశం. మూడేళ్లలో ఆ రీసెర్చ్‌ను పూర్తి చేసి 1990లో జావేద్ పబ్లిష్ చేశాడు. భారత్‌కే సొంత సమస్యలున్నాయని, వాటిని వాడుకుని శక్తిమంతమైన భారత సైన్యాన్ని నియంత్రించవచ్చని తన అధ్యయనంలో పేర్కొన్నాడు. అయితే, 1980 నుంచి మన దేశంపై పాకిస్తాన్ సైన్యం మనస్తత్వం ఎలా ఉందో ఈ రీసెర్చ్ తెలియజేసింది. దేశం విడిపోయినప్పటి నుంచి కాశ్మీర్‌ను ఆక్రమించడమే పాక్ తన ఎజెండాగా పెట్టుకుంది. దాని కోసమే కాశ్మీర్లో ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూనే ఉంది. మార్షల్ లా సమయంలో పాక్ అధ్యక్షుడు ఇస్కాందర్ మీర్జా నుంచి దేశ పగ్గాలను మొదటి ఆర్మీ జనరల్ అయూబ్ ఖాన్ గుంజుకున్నాడు.
అయితే, భారతీయులను తక్కువ అంచనా వేశాడు. ఇండియన్లు బలహీనంగా ఉన్నారనుకున్నాడు. ధైర్యం తక్కువని, తిరిగి కొట్టే శక్తిలేదని, ఒక్క దెబ్బ కొడితే భారతీయులంతా విచ్ఛిన్నమవుతారని అనుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత్ దాడి చేయదని అయూబ్ ఖాన్‌కు అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో హామీ కూడా ఇచ్చారు. ఆ తప్పుడు అభిప్రాయంతోనే 1965లో భారత్‌పైన పాక్ సైన్యం దాడి చేసింది. అయితే ఊహించని విధంగా 1965 డిసెంబర్ 3న భారత సైన్యం ఎదురుదాడి చేయడంతో అయూబ్‌ఖాన్ కంగారు పడిపోయాడు. వెంటనే 50 లక్షల కాశ్మీరీల కోసం.. 10 కోట్ల మంది పాకిస్తానీలను ప్రమాదంలో పడేయలేనని తన మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పాడు. ఆ నిర్ణయంతో పాక్‌సైన్యం వెనుదిరిగింది.
పాక్ మరో ఆర్మీ జనరల్ యాహ్యా ఖాన్ కూడా అయూబ్ ఖాన్‌లాగానే భారత్‌ను దెబ్బతీయొచ్చని కలలు కన్నాడు. పదేళ్ల పాటు నువ్వే దేశాధిపతివంటూ 1971లో కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో.. అతడి నమ్మకం మరింత పెరిగిపోయింది. ‘ముస్లిం యోధుల చారిత్రక ఆధిపత్యం ఆధారంగా భారత్‌పై యుద్ధం చేస్తాం’ అంటూ విర్రవీగాడు. భారత సైన్యం దాడి గురించి తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) చెప్పినప్పుడు.. ఆ దేశం కోసం తాను కేవలం ప్రార్థననే చేయగలనని చెప్పడం యాహ్యా ఖాన్ అధికార మదానికి అద్దం పడుతుంది. ఆ తర్వాత అతడు కనీసం 10 రోజులు కూడా అధికారంలో ఉండలేకపోయాడు. భారత్ వైమానిక దాడి గురించి పాకిస్తాన్ నేవీ చీఫ్ ద్వారా తెలుసుకుని.. బెంగాలీల కోసం పాకిస్తాన్‌ను ప్రమాదంలో పడేయలేనంటూ తోకముడిచాడు.
అయినా మారని దుర్మార్గపు ఆలోచనలు
రెండు యుద్ధాల్లోనూ పాక్ ఓడిపోయినా.. దాని దురాలోచనలు మాత్రం మారలేదు. కార్గిల్ యుద్ధానికి ముందు 1990లో కార్గిల్ నుంచే భారత్‌పై దాడి చేసేందుకు పాక్ సైన్యం ప్రతిపాదనలు చేసింది. అయితే, ఆ ప్రతిపాదనలను రెండుసార్లు తిరస్కరించారు. మొదటిసారి జియా ఉల్ హక్, రెండో సారి బెనజీర్ భుట్టోలు దాడి వద్దన్నారు. బెనజీర్ భుట్టో సమయంలో పాక్ ఆర్మీ అధిపతిగా పర్వేజ్ ముషారఫ్ ఉన్నాడు. అయితే, మూడోసారి ఆ ప్రతిపాదనలను తిరస్కరించే వీల్లేకుండా.. లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అజీజ్ ఖాన్, లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఖాన్, మేజర్ జనరల్ జావేద్ హసన్‌లతో కలిసి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తానని అన్నాడు. ఈ యుద్ధంలో లెఫ్టినెంట్ కల్నల్ జావేద్ అబ్బాస్ కూడా వాళ్లకు కీలకంగా మారాడు.
ఇండియా ఎదురుదాడి
ఇండియా శక్తి గురించి పాక్ అంచనా వేయలేకపోయింది. మొదట పాక్ దాడి చేయడంతో ఏం జరుగుతోందో అర్థంకాక ప్రభుత్వం, సైన్యం షాక్ తిన్నాయి. వెంటనే అప్రమత్తమై కార్గిల్‌లో పాక్ సైన్యం కుట్రలను సైనికులు తిప్పి కొట్టారు. శక్తిమంతమైన బోఫోర్స్ తుపాకులతో కొండలపైన ఉన్న పాక్ సైనికులను మట్టుబెట్టారు. వైమానిక దళాలనూ సైన్యం వాడింది. పాక్సైన్యాన్ని తరిమేసి ఆ దేశం ఆక్రమించిన కార్గిల్ కొండలను మళ్లీ వశపరచుకుంది. 1999 జూన్ 13న టోలోలింగ్ శిఖరాన్ని పాక్ చెర నుంచి విడిపించింది. మొత్తం యుద్ధంలో ఇదో గొప్ప విజయం. తర్వాత జూన్ 20న పాయింట్ 5140నూ స్వాధీనం చేసుకుని టోలోలింగ్ మిషన్‌ను పూర్తి చేసింది. 1999 జులై 4న టైగర్ హిల్స్‌ను చేజిక్కించుకుంది. ఆ క్రమంలో అన్ని శిఖరాలనూ స్వాధీనం చేసుకుంది. భారత్ వైమానిక దాడులు చేసినా పాక్ మాత్రం చేయలేదు. విమానదాడులు చేస్తే తామే దాడికి దిగినట్టు ప్రపంచానికి చెప్పినట్టవుతుందని భావించిన పాక్.. తాము యుద్ధం చేయడం లేదని, ముజాహిదీన్లు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధంలో పాక్‌సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ దేశ నార్తర్న్ లైట్దళం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఓ దశలో తన ఓటమిని అంగీకరించిన ముషారఫ్.. సైనిక చర్యలతోనే కాకుండా, ప్రపంచ దేశాల దౌత్యం ద్వారా కూడా భారత్ గెలిచిందని వాపోయాడు. ప్రపంచం మొత్తం తమను యుద్ధానికి బాధ్యులుగా చేసిందని నాటి పాక్ విదేశాంగ కార్యదర్శి శంషాద్ అహ్మద్ ఖాన్ అన్నారు. ప్రపంచం ఒత్తిడి చేయడంతో వెనకడుగు వేశామన్నారు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ అలీ కులీ ఖాన్.. కార్గిల్ ఓటమి చరిత్రలోనే పాకిస్తాన్‌కు అతిపెద్ద ఓటమిగా ప్రకటించారు. యుద్ధం సమయంలో భారీ సంఖ్యలో పాక్ ఆర్మీ అధికారులు డ్రగ్స్‌కు బానిసలయ్యారు.
విఫల దేశంగా పాకిస్తాన్
కార్గిల్ యుద్ధం పాకిస్తాన్‌ను ఒక విఫల దేశంగా నిలబెట్టింది. ఆ దేశ నాటి ప్రధాని, ఆర్మీ చీఫ్‌లు ఒకరిపై ఒకరు నిందలు మోపుకున్నారు. కార్గిల్ యుద్ధం గురించి తనకేమీ తెలియదని నవాజ్ షరీఫ్, అన్నీ తెలుసని ముషారఫ్ ఆరోపణలు చేసుకున్నారు. నిజంగా ఆ విషయం ప్రధానికి తెలియనట్టయితే.. ‘పాకిస్తాన్లో సైన్యం లేదు.. సైన్యంలోనే పాకిస్తాన్ ఉంది’ అన్న విషయాన్ని చెప్తుంది. ఇటు పాకిస్తాన్ సైన్యంలోనూ భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆపరేషన్ కోసం ఇంత భారీగా సైన్యాన్ని సమీకరించడంలో ఉద్దేశమేంటో చెప్పాలంటూ ముషారఫ్‌ను అప్పటి అడ్మిరల్ ఫైసుద్దీన్ బుఖారీ ప్రశ్నించాడు. చలికాలంలో ఎలాగైనా ఖాళీ చేయాల్సిన బంజరు భూమి కోసం పోరాడాల్సిన అవసరమేముందని నిలదీశారు. సైన్యాన్ని వెనక్కు పిలవాలని మిత్ర దేశం చైనా కూడా చెప్పడంతో పాక్ మరింత తట్టుకోలేకపోయింది. దీంతో సైన్యాన్ని పాక్ వెనక్కు పిలిచింది. అప్పుడు దాని కుట్రలు బయటపడ్డాయి. ముజాహిదీన్ పేరిట కాశ్మీర్లో పాక్ బీభత్సం సృష్టిస్తుందన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. సైనికులను ఎత్తైన శిఖరాల్లో పాక్ విడిచిపెట్టేసింది. కనీసం వారికి తిండి కూడా అందించలేదని..చనిపోయిన సైనికుల శవపరీక్షలు వెల్లడించాయి. చాలా మంది సైనికుల కడుపుల్లో గడ్డి ఉన్నట్టు తేలింది. అంటే కనీసం వారికి తిండిని కూడా పాక్ అందించలేదని బహిర్గతమైంది. పాక్ ఏర్పాటైనప్పటి నుంచి ఆ దేశంలో జవాబుదారీతనం లేదు. కార్గిల్ యుద్ధానికి కారణమైన ఆర్మీ చీఫ్ దేశాధ్యక్షుడయ్యారు. యుద్ధంలో సైన్యాన్ని నడిపించిన ఆర్మీ ఆఫీసర్‌కు ప్రమోషన్ వచ్చింది.
కార్గిల్‌పై కుట్రలు
కార్గిల్‌పై దాడిలో భాగంగా భారత్ ఎదురుదాడి చేయకుండా ఆపాలని భావించిన పాక్ సైన్యం.. ముందుగా శ్రీనగర్ , లేహ్‌ను కలిపే హైవేపై సరుకుల రవాణాను నిలిపేయాలని అనుకుంది. జిహాద్ కోసం 20 వేల నుంచి 30 వేల మంది దాకా యువకులను పంపించాల్సిందిగా ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ అధిపతి ముల్లా రబ్బానిని అడిగింది. అయితే, 30 వేలు కాదు.. 50 వేల మందిని పంపిస్తానని రబ్బాని హామీ ఇచ్చాడు. 1965, 1971 యుద్ధాల తర్వాత కార్గిల్‌పై భారత్ పట్టుసాధించడంపై ముషారఫ్ అసహనంతో రగిలిపోయాడు. భద్రతా పరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆ ప్రాంతపు శిఖరాలను చేజిక్కించుకోవాలని కలలుకన్నాడు. యుద్ధమంటూ వస్తే అణుయుద్ధానికి దారితీసే అవకాశాలున్నందున.. మూడో పార్టీ జోక్యం తప్పనిసరి అవుతుందని భావించి కాశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా మార్చేందుకు పాక్ ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఎల్వోసీని దాటి కార్గిల్‌లోని ప్రాంతాలను ఆక్రమించేందుకు కుట్రలు పన్నింది.
- డా. టి. ఇంద్రసేనారెడ్డి రసాయన, పర్యావరణ, సామాజిక శాస్త్రవేత్త