గత ప్రభుత్వాలు బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగానే భావించాయి. బహుజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచించక.. సంక్షేమ పథకాలను ఎరగా వేశాయి. అంతే తప్ప తరాలుగా వారి విముక్తి కోసం రాజ్యాంగ పరమైన హక్కులు, రాజ్యాధికారంలో వాటా కోసం చర్యలు తీసుకోవడానికి సాహసించలేకపోయాయి. కానీ బహుజనుల అభివృద్ధే దేశాభివృద్ధి అని భావిస్తూ అట్టడుగునున్న వర్గాలకు సామాజిక న్యాయం దక్కేలా, రాజ్యాంగం కల్పించిన హక్కులు దక్కేలా ప్రధాని నరేంద్రమోడీ చర్యలు తీసుకోవడం, బహుజనులకు కేబినెట్లో 70 శాతానికిపైగా పదవులు ఇవ్వడం హర్షణీయం. ఈ విజయాన్ని, ఆవశ్యకతను బహుజన నాయకులు, మేధావులు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల వరకు తీసుకెళ్లాలి.
ఇప్పటిదాకా భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రను మూసధోరణిలో చూసే దృష్టి ఒకటి స్థిరపడింది. దేశ సంస్కృతిని, నాగరికతను నిలబెడుతున్న హక్కుదారులు అత్యధికులు బహుజనులే. దేశ జనాభాలో 80 శాతం పైగా ఉన్న బహుజనులు దేశ నిర్మాతలు.. కానీ వీరిని బలహీనవర్గాలుగా చిత్రించి ఆత్మనూన్యతా భావంలోకి నెట్టేశారు. దీనికితోడు బహుజనులను పాలకులు గౌరవించకపోగా వాళ్ల పాత్రను కుదించి అవమానించారు. నిజానికి బహుజనులు సమస్త రంగాల్లో శ్రామికులుగా, ఉత్పత్తిదారులుగా, సేవకులుగా, డాక్టర్లుగా, పరిశోధకులుగా, బోధకులుగా, కళాపోషకులుగా, జ్ఞానులుగా, విజ్ఞానులుగా, తత్వవేత్తలుగా, సంపద సృష్టికర్తలుగా, గ్రామీణ వ్యవస్థ పునాదులుగా, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షకులుగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దేశాన్ని నిర్మించి పాలించిన వాసులే బహుజనులు. అన్ని రంగాల్లో అపారమైన కృషి చేసి, మన దేశానికి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చారు.
కేంద్ర కేబినెట్లో సమన్యాయం
‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అనే సమన్యాయ మూల సూత్రానికి ప్రతిరూపమే కేంద్ర మంత్రివర్గం. మంత్రివర్గంలోని 27 ఓబీసీ మంత్రుల కులాలను పరిశీలిస్తే.. యాదవ, కుర్మీ, దర్జీ, జాట్, గుజ్జర్, ఖండయత్, భైరాగి, ఠాకూర్, కోలీ, వక్కలింగ, తులు గౌడ, ఈజవా, లోధా, అగ్రీ, వంజరా, మీటి, నాట్, మల్లా నిషాద్, మోద్ తేలి, నాయీ బ్రాహ్మణ తదితరల కులాల వాళ్లు ఉన్నారు. ఇందులో 15 రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేబినెట్ మంత్రులుగా, 22 మందికి సహాయ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఎస్సీలోని చామర్ రాందసియా, కటిక, కోరి, మాదిగ, మహర్, అరుంధతియార్, మెగ్వాల్, మాత్ నామశూద్ర, దన్ గర్, బుసాద్ కులాలకు చెందిన వాళ్లలో ఎనిమిది రాష్ట్రాల నుంచి ఇద్దరిని కేబినెట్ మంత్రులుగా, పది మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎస్టీలోని గోండ్, సంతాల్, మీజి, ముండా, టీ ట్రైబ్, కొంకణ్, సోనోవాలా కచారి కులాలకు చెందిన వాళ్లలో ఎనిమిది రాష్ట్రాల నుంచి ముగ్గురిని కేబినెట్ మంత్రులుగా, ఐదుగురిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు. మహిళా ప్రాతినిధ్యాన్ని చూస్తే ఇద్దరు కేబినెట్ మంత్రులుగా, తొమ్మిది మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లిం, సిక్, క్రిస్టియన్, బుద్ధిస్ట్ మతాల నుంచి ఐదుగురికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ప్రాంతాలు/భాషా పరంగా చూస్తే మంత్రివర్గంలో 30 రాష్ట్రాలకు అవకాశం ఇచ్చారు. మంత్రివర్గంలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే. వీళ్లే యువభారతానికి మార్గదర్శకులుగా ఉంటారు. జులై 8న మోడీ నేతృత్వంలో ప్రజాస్వామ్య సౌధాన్ని బలోపేతం చేస్తూ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. దీని వెనకాల బహుజనుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన బాధ్యత దేశ ప్రధాని రూపంలో మనకు కనిపిస్తుంది. స్వయంగా ఆయన బీసీ కులానికి చెందడం వల్ల ఈ కులాల్లో రాజ్యాధికార కాంక్ష నింపడం కోసం ఇటువంటి సాహసోపేత, చారిత్రక నిర్ణయాలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టడం హర్షణీయం.
- సూర్యపల్లి శ్రీనివాస్ రాష్ట్ర కో కన్వీనర్, బీజేపీ ఎంబీసీ సెల్