పాలమూరును పాతాళానికి తొక్కొద్దు

‘‘పోతిరెడ్డిపాడుకు పొక్క పెడుతుంటే.. మనోళ్లు మంగళహారతులు పట్టిన్రు. అధికారంలోకి వచ్చినంక కృష్ణా నది గట్టుమీద కూసునైనా మన పంటలకు నీళ్లను మళ్లిస్తా..” ఇదీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014  గద్వాల ఎన్నికల సభలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇచ్చిన భరోసా. కానీ ఇయ్యాల కృష్ణా నదిపై ఏపీ సర్కారు రాయలసీమ లిఫ్ట్ (సంగమేశ్వరం ప్రాజెక్టు) కడుతూ, పోతిరెడ్డిపాడుకు పొక్క పెడుతున్నా పెద్ద సారు ఏం చేస్తున్నరో..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

కృష్ణా నీళ్లతో ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చిన్రు. కానీ ఇప్పటికీ కృష్ణమ్మకు చెంతనే ఉన్న పాలమూరు ప్రజలకు నీళ్లలో ఇంకా పూర్తి వాటా దక్కనేలేదు. ఉమ్మడి పాలమూరుకు నెట్టెంపాడు ద్వారా 22 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా 40 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ ద్వారా 36.22 టీఎంసీల నీళ్లు కృష్ణా నది నుంచి అందాల్సి ఉన్నా, ఇప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ 1996 నాటికే పూర్తికావాలి. అది పూర్తి అయితే దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. ఇవి కాకుండా భీమా లిఫ్ట్ ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. దీనిని రెండు లిఫ్టులుగా నిర్మించారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినా, చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం ఏండ్ల తరబడి ఇంచు కూడా కదలడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉండటంతో ఏపీ సర్కారు తెలివిగా వీటికి దక్కాల్సిన నీళ్లను తమ ప్రాంతానికి మళ్లిస్తోంది. 
దక్షిణ తెలంగాణకు అన్యాయం 
నదీ జలాలతో 1960 నాటికి సీమాంధ్ర ప్రాంతంలో పెంచుకున్న సాగు వినియోగం13 లక్షల ఎ కరాలు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ 1975లో 811 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది. వాస్తవానికి 500 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిం ది. కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (తూం) కెపాసిటీని భారీగా పెంచి రాయలసీమకు పెద్ద ఎత్తున నీళ్లను మళ్లిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కృష్ణా నీళ్ల తరలింపు ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. పోతిరెడ్డిపాడులో కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్ఆర్ బీసీ, జీఎస్ ఎస్ఎస్, ఆత్మకూర్ గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆయన చర్యలు చేపట్టారు. 
80 వేల క్యూ సెక్కుల కెపాసిటీ
అంటే రోజుకు సుమారుగా 8 టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే అత్యంత భారీగా 80 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం నీరు లిఫ్ట్ చేసుకునే దానికంటే మూడు రెట్లు ఎక్కువగా తీసుకొనిపోతుంది. ఈ అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వానికి అడగాల్సిన బాధ్యతలేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 
అప్పుడు సైలెంట్.. ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు..  
రెండు రాష్ట్రాల్లో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోవాలని విభజన చట్టం స్పష్టంగా చెప్తున్నది. కానీ ఏపీ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. మన వాటా నీళ్ళను ఎత్తుకపోతున్న ఏపీ సీఎం జగన్ ను ఇంటికి పిలిచి విందు ఇచ్చిన కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల నీళ్ళ సమస్యలు గుర్తుకు రాలేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగుకు వెళ్ళకుండా ఏపీప్రాజెక్టు డీపీఆర్ సర్వేకోసం జీవోలు ఇచ్చినప్పుడు, టెండర్లు పిలిచినప్పుడు, పనులు ప్రారంభించినప్పుడు సైలెంటుగా ఉండి ఇప్పుడు టీఎంసీలు, క్యూసెక్కులు అంటే కూడా తెలియని మంత్రులతో రెచ్చగొట్టే కామెంట్లు చేయించడం వెనక ఉద్దేశాలు ఏమిటి? ఎప్పటికప్పుడు అన్నీ తెలిసిన కేసీఆర్ మాట్లాడక పోవటంలో అర్థం ఏమిటి? దీనిపై ఒక్కరోజైనా కేంద్రంతో కలిసి చర్చించారా? అనే దానికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఈ విషయంలో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూర్ రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉన్నది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి ఏపీ అన్యాయాలను అడ్డుకోవాలని దక్షిణ తెలంగాణ రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు.  

సర్కారుకు బాధ్యత లేదా? 
ఉమ్మడి రాష్ట్రంలోనే అక్రమంగా మొదలైన ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ తో పాటు దాదాపు దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటా నీటి కరువు తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి తరలించుకునేందుకు గతంలో పోతి రెడ్డిపాడు గండి (హెడ్ రెగ్యులేటర్)కు డిజైన్ చేశారు. మొదట11500 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న ఆ గండిని ఉమ్మడి ఏపీలోనే 44 వేల క్యూసెక్కులకు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పుడు అదే గండిని మరోసారి డబుల్ చేసుకునేం దుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 
కేసీఆర్ ఎందుకు మాట్లాడ్తలే? 
నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుందాం అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చెప్పిన కేసీఆర్.. ఇవ్వాళ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకపోవడం దారుణం. ఒక పక్కన ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80000 క్యూసెక్కులకు, ఎస్ఆర్ బీసి (శ్రీశై లం రైట్ బ్రాంచ్ కెనాల్) గాలేరు నగరి సామర్థ్యాన్ని 3000 క్యూసెక్కులకు పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం కేసీఆర్ కు తెల్వదా? ఈ విషయంపై టీఆర్ఎస్ సర్కారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు? పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే దక్షిణ తెలంగాణ ప్రయోజనాలకు పెద్ద గండి పడుతుంది. ఏకంగా రోజుకు 8 టీఎంసీల వరకు తరలించుకుపోయేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లోని నీళ్ళన్నింటిని పూర్తిగా తోడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి వీలు చిక్కు తుంది.                                                           - మన్నారం నాగరాజు రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ