విశ్వాసం.. ఉత్సాహంగా ఉరకాలి

విశ్వాసం.. ఉత్సాహంగా ఉరకాలి

తండ్రి మాట మీద అరణ్యాలకు వచ్చాడు రాముడు. ఒకనాడు ఒక బంగారు లేడి వారి ఆశ్రమం ముందుగా అటుఇటు కదలాడుతూ ఆకర్షించింది. ఆ లేడి మీద మనసు పడింది సీత. లేడిని తీసుకురావడానికి బయలుదేరాడు రాముడు. అది రాక్షస మాయ అని తెలుసుకున్నాడు. బాణంతో ఆ లేడిని చంపేశాడు. లేడి రూపంలో ఉన్న మారీచుడు మరణిస్తూ ‘హా సీతా, హా లక్ష్మణా’ అని రాముని కంఠస్వరంతో అరిచాడు. అప్పుడు లక్ష్మణుడు సీతమ్మ మాట మీద రాముని దగ్గరకు బయలుదేరాడు. 

అదను చూసుకుని రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. సీతమ్మ కోసం రాముడు అరణ్యమంతా అన్వేషిస్తూ.. తనకు రక్షకులు లేరు అనే భావనతో విలపించాడు. ఆ సందర్భంలో లక్ష్మణుడు కొన్ని మంచి మాటలు పలికినట్లు వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండ చెబుతోంది. ఆ మాటలు యుక్తమైనవి, దోషాలు లేనివి.

ప్రియమైన వ్యక్తుల వియోగం వల్ల దుఃఖం కలుగుతుందనే విషయం గుర్తుంచుకో. ప్రియ జనం పట్ల ఉన్న గాఢ స్నేహాన్ని విడిచిపెట్టు. ఎక్కువ తైలంతో సంబంధం కలిగి ఉంటే, నీటికి తడిసిన వత్తి కూడా మండిపోతుంది. అందువల్ల క్షేమకరమైన ధైర్యాన్ని అవలంబించు. కార్యరూపమైన ప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు ప్రయత్నం చేయకుండా మళ్లీ దానిని పొందజాలరు కదా. ఉత్సాహానికి మించిన బలం లేదు. ఉత్సాహవంతులకు ఈ లోకంలో లభించనిది లేదు. ఉత్సాహవంతులకు ఏ పనులలోనూ ఓటమి ఉండదు. అందువల్ల ఉత్సాహాన్ని పెంచుకో. శోకాన్ని వెనక్కి నెట్టేసెయ్యి’’ అని చెప్పాడు.

సంతోషం కలిగితే పొంగిపోవడం, దుఃఖం కలిగితే కుంగిపోవడం మానవుల సహజ లక్షణం. తాను తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సీతాదేవి కనిపించకపోవడంతో రాముడు ధైర్యాన్ని కోల్పోయి సామాన్యుడిలా విలపించాడు.

లక్ష్మణుడి మాటలతో మనసును కుదుటపరచుకుని, మంచి మిత్రులను సంపాదించుకుని, ఎట్టకేలకు అన్వేషణ ఫలించి సీతమ్మను చూడగలిగాడు. ఇంత కథకూ కారణం రాముడు ఉత్సాహంతో ముందుకునడవడమే.

సంతోషం సగం బలం’అని పెద్దలు చెబుతారు. ఇంకా...

తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’’ అని సుమతీ శతకకారుడు బద్దెన చెబుతున్నాడు. మనం ఆనంంగా ఉంటే స్వర్గంలో ఉన్నట్లే, దుఃఖంలో ఉంటే నరకంలో ఉన్నట్లే. ఈ భూమి మీదే స్వర్గనరకాదులను చూడటం మన చేతిలోనే ఉందని ఈ పద్యం చెబుతోంది. అందుకే దుఃఖంలోఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదంటారు. అలాగే సంతోషంతో ఉన్న సమయంలో వరాలివ్వకూడదని కూడా చెబుతారు. ఏ పని చేయటానికైనా మన మనసు ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి భావోద్వేగాలకు లోనైనా మనం తీసుకునే నిర్ణయాలకు దుష్ఫలితాలు ఎదురవుతాయి. 

విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు కాకపోయినంత మాత్రాన ఇంక జీవించడం వృథా అనుకుంటే, ఈ దేశంలో సగం జనాభా ఆత్మహత్యలు చేసుకుని ఉండేది. ప్రతి అపజయమూ విజయానికి ఒక సోపానం అని భావించాలి. సాలీడు గూడు అల్లుకోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గూడు అల్లికలో ఏ ఒక్క చిన్న పొరపాటు వచ్చినా, ఆ గూడును విడిచి, మరో గూడు అల్లుతుంది. అలా సుమారు ఇరవైసార్ల దాకా అల్లి, చివరకు విజయం సాధిస్తుంది. గిజిగాడు కట్టే గూడు కూడా అంతే. అల్లికలో చిన్న పొరపాటు వచ్చినా, మరోసారి కొత్త గూడు అల్లడం మొదలుపెడుతుంది. ఇంత చిన్నప్రాణులు సైతం శోకానికి లొంగిపోకుండా, ప్రతి అపజయాన్ని విజయానికి నిచ్చెనగా భావించుకుంటూ, మెట్లు ఎక్కుతూ, కిందకు దిగుతూ, ఎట్టకేలకు లక్ష్యాన్ని సాధిస్తున్నాయి. అందుకే లక్ష్మణుడు రామునితో ఆ పలుకులు పలికాడు. మనిషి ఉత్సాహంగా ఉంటేనే సక్రమమైన ఆలోచనలు వస్తాయి. శోకంతో ఉన్న మనసు సదాలోచనలను స్ఫురింపచేయదు. 

మహాభారతంలో...

జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసానికి వెళ్లారు. వారి వెంట వేలకొలదీ బ్రాహ్మణులు, మునులు.. ఎందరో బయలుదేరారు. వారికి ఆహారం ఏ విధంగా పెట్టాలో ధర్మరాజుకి అర్థం కాలేదు. అటువంటి సమయంలో శౌనక మహర్షి ధర్మరాజుతో, ‘ధైర్యాన్ని విడిచిపెట్టకు. సంకల్ప బలం ఉంటే నీకు అన్నీ సమకూరుతాయి’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు సూర్యుని స్మరించాడు. ధర్మరాజు అతిథులను సంతుష్టులను చేయడానికి వీలుగా చక్కని వానలు కురిశాయి. పంటలు పండాయి. ధర్మరాజు పరమానందభరితుడయ్యాడు. 

గంగానదిని భూమి మీదకు తీసుకురావడం కోసం భగీరథుడు తపస్సు చేశాడు. గంగ పయనించే మార్గంలో అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. భగీరథుడు శోకాన్ని దరిచేరనీయకుండా, ఉత్సాహాన్ని వెన్నంటి ఉంచుకుని కార్యసాధకుడయ్యాడు. అందుకే నేటికీ భగీరథ ప్రయత్నం అనే మాటలను వాడుతూనే ఉన్నాం.బాధ పెరిగే కొద్దీ జీవితం మీద విరక్తి కలుగుతుందంటారు. అందువల్లే బాధను పక్కకు తోసి, ఉత్సాహంగా ఉండాలని వాల్మీకి చెబుతున్నాడు.- డా. పురాణపండ వైజయంతి