- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
న్యూఢిల్లీ: దేశంలో క్షయవ్యాధి (టీబీ) సంక్రమణ రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2015లో లక్ష జనాభాలో 237 మంది టీబీ బాధితులు ఉంటే.. 2023 నాటికి 195(17.7 శాతం)కు తగ్గిందని చెప్పారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. 2015లో లక్ష జనాభాలో 28 మంది టీబీతో మరణించగా.. 2023 నాటికి ఆ సంఖ్య 22 (21.4 శాతం)కు తగ్గిందని చెప్పారు. 2025 నాటికి టీబీని నిర్మూలించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (2017 – -2025)ను అమలు చేస్తున్నదని నడ్డా తెలిపారు.
ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్టీఈపీ)ను మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందన్నారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చడానికి ఎన్టీఈపీ గణనీయమైన కృషి చేసిందని, దీంతో టీబీ సంక్రమణ రేటు, మరణాలు తగ్గాయని ఆయన స్పష్టం చేశారు. టీబీ స్క్రీనింగ్, ట్రీట్మెంట్సేవలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఏకీకృతం చేయడం, టీబీ కేసుల నోటిఫికేషన్, నిర్వహణ కోసం ప్రోత్సాహకాలతో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.