చౌటుప్పల్, వెలుగు : దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికిమంత్రి హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు 40 ఏళ్లలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ఎనిమిదేళ్లలోనే చేసి చూపించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, సైదిరెడ్డి, మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్‌రావు, మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రాజు, డైరెక్టర్ చింతల దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండు వృద్ధాశ్రమాలు సీజ్
యాదాద్రి, వెలుగు : సీడబ్ల్యూసీ రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపురంలోని రెండు వృద్ధాశ్రమాలను మంగళవారం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని వానప్రస్థ ఆశ్రమానికి రిజిస్ట్రేషన్ లేదు. ఇందులో ఉండే వృద్ధులు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆశ్రమ నిర్వహణ, ఫీజులకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వడం లేదు. దీంతో ఈ ఆశ్రమాన్ని సీజ్ చేశారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న నలుగురు వృద్ధుల్లో ఇద్దరిని వారి పిల్లలకు అప్పగించగా, మరో ఇద్దరి పిల్లలు బుధవారం తీసుకెళ్తామని చెప్పారు. దీంతో వారిద్దరిని పక్కనే ఓ ఇంట్లో ఉంచారు. సాయి ధామం ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకున్నారు. అయితే ఆశ్రమ నిర్వాహకుడు రామానంద ప్రభూజీపై కేసు నమోదు కావడంతో ఈ ఆశ్రమాన్ని కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఉన్న వృద్ధురాలిని చౌటుప్పల్‌లోని సాయి యాదాద్రి సేవాశ్రమానికి పంపించామని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి తెలిపారు.
టీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
నార్కట్‌పల్లి, వెలుగు : రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాల్లో మంగళవారం ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన 10 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేశ్‌గౌడ్, జడ్పీటీసీ ధనమ్మ, మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య పాల్గొన్నారు.
హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలం
చండూరు, వెలుగు : హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలం అయిందని మునుగోడు కాంగ్రెస్ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతి విమర్శించారు. నల్గొండ జిల్లా చొప్పరివారిగూడెంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ తన ఫ్యామిలీని మాత్రమే బంగారంగా మార్చుకొని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే కుటుంబ పాలన అంతం అవుతుందన్నారు. స్వలాభం కోసం బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి
యాదగిరిగుట్ట, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం, మాసాయిపేట, మల్లాపురంలో మంగళవారం నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ మిగులు బడ్జెత్‌తో ఇచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో తన ఫ్యామిలీని మాత్రమే బాగు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై యుద్ధం చేస్తున్నట్లు నాటకం ఆడుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి, ఎంపీపీ చీర శ్రీశైలం, వైస్ ఎంపీపీ ననబోలు ప్రసన్న శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ.యాకూబ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఎలేందర్‌రెడ్డి, సర్పంచ్ బీర్ల శంకర్, ఉపసర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం
చండూరు/మునుగోడు, వెలుగు : గీత కార్మికుల సంక్షేమమే తన లక్ష్యమని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. నల్గొండ జిల్లా చండూరు, మర్రిగూడ, మునుగోడులో మంగళవారం పొట్టి తాటి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పొట్టి తాటి విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మెడికల్ బోర్డు రూల్‌ను తొలగించేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానన్నారు. ప్రతి సొసైటీకి విత్తనాలు అందిస్తామన్నారు. వైన్స్ టెండర్ల రిజర్వేషన్‌ను 30 శాతానికి పెంచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మర్రిగూడ మండలం యరుగుండ్లపల్లి కంఠమహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులో గౌడ కమ్యూనిటీహాల్‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కర్నాటి విద్యాసాగర్, దంటు జగదీశ్వర్, మండి మోహన్‌రెడ్డి, బొడ్డు శ్రావణి నాగరాజు, జాజుల అంజయ్య, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, ఎంపీటీసీలు శ్రావణి నాగరాజుగౌడ్, పోలగోని విజయలక్ష్మి సైదులు గౌడ్ పాల్గొన్నారు.
రోడ్లకు రిపేర్లు చేయండి
యాదాద్రి, వెలుగు : గుంతలు పడిన రోడ్లకు రిపేర్లు చేయాలంటూ మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ లీడర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు పడి వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గురించి పట్టించుకోని ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించి రోడ్లకు రిపేర్లు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పడిగెల ప్రదీప్, కైరంకొండ వెంకటేశ్, ఈరపాక నరసింహ, వడిచర్ల లక్ష్మీకృష్ణ యాదవ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
‘మదర్ డెయిరీని అప్పుల పాలు చేశారు’
టీఆర్‌ఎస్ పెత్తనం కారణంగా లాభాల్లో ఉన్న మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఆలేరు నియోజకవర్గ నాయకుడు పడాల శ్రీనివాస్ ఆరోపించారు. యాదాద్రి జిల్లా భువనగరిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా రూ. 12 కోట్ల లాభంతో నడిచే డెయిరీని ఇప్పుడు రూ. 44 కోట్ల అప్పుల్లో ముంచారన్నారు. పాల సేకరణను కూడా పూర్తిగా తగ్గించారన్నారు. సంస్థకు నష్టాలు వస్తున్నప్పటికీ లాభాల్లో నడుస్తుందని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. డెయిరీ నష్టాలపై విచారణ జరిపించాలని
డిమాండ్ చేశారు.
యాత్ర ముగింపు సభను సక్సెస్ చేయాలి
చౌటుప్పల్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను సక్సెస్ చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం నిర్వహించిన బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జుల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 22న పెద్ద అంబర్‌పేటలో ముగింపు సభ జరుగుతుందన్నారు. దూడల భిక్షం, ఊడుగు వెంకటేశ్‌గౌడ్, రిక్కల సుధాకర్‌రెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, పెద్దటి బుచ్చిరెడ్డి, పబ్బు రాజుగౌడ్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
బీజేపీ వల్లే దళిత, గిరిజన బంధు
తుంగతుర్తి, వెలుగు : బీజేపీ వల్లే రాష్ట్రంలో దళిత, గిరిజన బంధు పథకాలు వచ్చాయని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలు ఉన్నందునే టీఆర్‌ఎస్‌కు గిరిజన సమస్యలు గుర్తుకొచ్చాయన్నారు. హుజూరాబాద్‌లో దళితుల ఓట్ల కోసం దళితబంధు, మునుగోడులో గిరిజనుల ఓట్ల కోసం గిరిజన బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తే జనరల్ ఎలక్షన్ నాటికి బీసీ బంధు కూడా ప్రవేశపెడుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మహేందర్, ఎంపీటీసీ ఉప్పుల పద్మలింగయ్య, నాయకులు కొండ వెంకన్న, వడ్లకొండ శ్రీను పాల్గొన్నారు.
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
చౌటుప్పల్, వెలుగు : ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన అల్లు సత్యనారాయణ (45) నల్గొండ జిల్లా కోదాడ నుంచి పీడీఎస్ బియ్యం లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటకు చేరుకోగానే ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ స్పాట్‌లోనే చనిపోయాడు. లారీలో ఉన్న బడ్యా శివ, షేక్ చందాని, కుర్ర వెంకటేశ్వర్లు గాయపడ్డారు.