పేషెంట్లే టార్గెట్‌‌‌‌ .. చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్‌‌‌‌

 పేషెంట్లే టార్గెట్‌‌‌‌ ..  చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్‌‌‌‌

వరంగల్‌‌‌‌సిటీ, వెలుగు: హాస్పిటల్‌‌‌‌కు వచ్చిన మహిళల నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్న ఓ మహిళను వరంగల్‌‌‌‌ మట్టెవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌‌‌ ఏసీపీ నందిరామ్‌‌‌‌ నాయక్‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ముల్కనూరుకు చెందిన తురసటి శారద (50) ఈజీగా డబ్బు సాధించేందుకు మహిళల నుంచి బంగారు ఆభరణాలు కొట్టేసేందుకు ప్లాన్‌‌‌‌ చేసింది. 

ఇందులో భాగంగా సర్కార్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌కు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం వచ్చే మహిళలతో పరిచయం పెంచుకొని వారితో చనువుగా మాట్లాడేది. ఆ తర్వాత వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించడంతో పాటు, కొట్టి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకెళ్లేది. ఇదే తరహాలో గత నెల 28న వరంగల్‌‌‌‌ ఎంజీఎంకు వచ్చి మడికొండకు చెందిన నిప్పుల భారతి అనే మహిళ వద్ద బంగారు గొలుసు చోరీ చేసింది. 

దీంతో ఆమె మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ గోపి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. శారద మరోసారి ఎంజీఎంకు వచ్చిందని సమాచారం తెలియడంతో ఎస్సై విఠల్‌‌‌‌ తన సిబ్బందితో వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎల్కతుర్తి, హుజురాబాద్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్ల పరిధిలో సైతం చోరీలు చేసినట్లు అంగీకరించింది. 

ఆమె వద్ద నుంచి రూ. 2.50 లక్షల విలువైన 3.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని, అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితురాలిని పట్టుకున్న మట్టెవాడ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ గోపి, ఎస్సై విఠల్‌‌‌‌, కానిస్టేబుళ్లు ఆలీ, హరికాంత్, రాజేందర్‌‌‌‌ను ఏసీపీ అభినందించారు.