ఖమ్మం జిల్లాలో కలకలం .. సత్తుపల్లిలో వరుసగా ఆరు ఇండ్లలో చోరీ చేసిన దుండుగులు

ఖమ్మం జిల్లాలో కలకలం .. సత్తుపల్లిలో వరుసగా ఆరు ఇండ్లలో చోరీ చేసిన దుండుగులు

సత్తుపల్లి, వెలుగు : వరుసగా.. ఒకే సమయంలో ఆరు ఇండ్లలో చోరీ జరిగిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి టౌన్ లో మంగళవారం అర్ధరాత్రి సింగరేణి క్వార్టర్స్(పీవీఎన్ రావు సెంటినరీ కాలనీ) కాంపౌండ్ వాల్ వెనక నుంచి లోనికి వెళ్లిన ముగ్గురు దుండగులు మంకీ క్యాప్ లు ధరించి వరుసగా లాక్ చేసిన ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. క్వార్టర్స్ లో ఉండేవారు సమాచారం అందించడంతో పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి వెళ్లి  సీసీ కెమెరాల ఫుటేజ్ లు చెక్ చేశారు.

 ఖమ్మం నుంచి క్లూస్ టీం, డాగ్స్ స్క్యాడ్ ను రప్పించి చోరీకి పాల్పడిన దుండగుల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. రాజశేఖర్ అనే సింగరేణి ఉద్యోగి ఇంట్లోరూ.31.25 లక్షల విలువైన 350 గ్రాములు బంగారం వస్తువులు, కేజిన్నర వెండి చోరీ జరిగినట్లు గుర్తించారు. మరో వ్యక్తి రామస్వామి ప్లాట్ లో సామగ్రి చిందరవందరగా వేశారు తప్ప అక్కడ ఏ వస్తువు పోలేదు. ఇంకా నాలుగు ఇండ్లలో దొంగతనం జరుగగా  ఆ ఇండ్ల యజమానులు అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ ఏ ఏ వస్తువులు పోయాయో తెలియలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు.