- పత్తి తీసేందుకు, వరి కోతలకు రైతుల తిప్పలు
హైదరాబాద్, వెలుగు: ఓ వైపు విరగబూసిన పత్తి.. మరో వైపు చేతికొచ్చిన వరి.. ఇలాంటి టైమ్లో రైతులను కూలీల కొరత వేధిస్తున్నది. పత్తి తీసేందుకు, వరి కోతకు కైకిలోళ్లు దొరకడం లేదు. దీనికి తోడు కూలి రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ఆటోలు పెట్టి మరీ వారిని రప్పించాల్సి వస్తున్నది. కూలి రేట్లకు తోడు ఆటో కిరాయిలు కూడా రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. పత్తి చేన్లకు పెట్టిన పెట్టుబడి, ఇప్పుడు పెరిగిన కైకిళ్లు అన్ని కలుపుకుంటే పెట్టిన పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజు కూలి రూ.500పైనే
గతంలో సాధారణ పంట పొలాల పనులకు కూలి రూ.200 ఉంటే.. నిన్న మొన్నటి వరకు అది కాస్త రూ.300కు చేరింది. కూలీలకు డిమాండ్ భారీగా పెరగడంతో ఇప్పుడు రోజుకు రూ.500 పైనే ఇవ్వాలన్న డిమాండ్ వస్తున్నది. రైతులకు కూలీల అవసరం ఎక్కువగానే ఉండడంతో ఎంతైనా ఇచ్చి తీసుకుపోక తప్పడం లేదని రైతులు అంటున్నారు. అదనంగా ఆటో కిరాయి ఐదారు వందల రూపాయలు పెట్టాల్సి వస్తున్నదని చెప్తున్నారు. ఎప్పుడు మొగులైతదో, ఎప్పుడు వాన పడుతదో అర్థంకాని వాతావరణ పరిస్థితులతో ఎంతైనా ఇచ్చి పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. లేకపోతే చిన్న వాన పడ్డా పంట చేతికి రాదని ఆందోళన చెందుతున్నారు.
వరికోతలకు మిషిన్లు లేని చోట..!
వరికోతలకు ఇప్పుడు ఎక్కువగా మిషిన్లపైనే ఆధారపడుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఒకేసారి కోతలు షురూ అవడంతో కొన్ని గ్రామాల్లో వరికోతలకు మిషన్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో మిషిన్లు దొరకని ప్రాంతాల్లో వరికోతలకు రైతులు కూలీలను వినియోగిస్తున్నారు. రోజు కూలీ రూ.500 చొప్పున ఇస్తే.. ఎకరానికి పదిమంది కూలీలకు రూ.5,000 ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు.
గిట్టుబాటు అయితలేదు
రెండెకరాల్లో పత్తి వేసినం.. రెండు సార్లు తీసినం. పత్తి తీయడానికి గతంలో కంటే ఎక్కువ ఇస్తామని అంటేనే కూలీలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంటిదగ్గర ఆటోపెడితేనే కూలీలు వచ్చారు. పెట్టిన పెట్టుబడి, పత్తి గింజలు, మందులు.. కైకిళ్లు ఇవన్నీ కలిపితే లక్షరూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినం. ఏం మిగులతలేదు..రైతుకు ఫాయిదా లేదు. మంగ సుమతి, మహిళా రైతు, గూడురు, మహబూబాబాద్ జిల్లా