వందే భారత్‌ రైలు.. తొలి రోజు రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే..

వందే భారత్‌ ఎక్స్ప్రెస్ను ఈనెల 15వ తేదీ సంక్రాంతి రోజు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 15న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు తెలిపారు. 15న రాత్రి 8 గంటల 45 నిమిషాలకు విశాఖకు చేరుకుంటుందని వివరించారు. 

కేవలం 15వ తేదీ మినహా మిగితా రోజుల్లో కొన్ని రైల్వేస్టేషన్లలో మాత్రమే వందే భారత్ రైలు ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో మాత్రమే నిలుపుతామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.