భూమికి పట్టా చేయిస్తామని రూ.12 లక్షలకు టోకరా

భూమికి పట్టా చేయిస్తామని రూ.12 లక్షలకు టోకరా
  • ఆరుగురిపై కేసు నమోదు  
  • నిందితుల్లో జగిత్యాల మున్సిపల్ ఉద్యోగి
  • మెట్ పల్లిలో ఘటన

మెట్ పల్లి, వెలుగు : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం మరో ఐదుగురికి వరంగా మారింది. వివాదం పరిష్కరించి భూమికి పట్టా చేయించి ఇస్తామని నమ్మబలికి బాధితులను రూ.12 లక్షలకు ముంచారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం పట్టణానికి చెందిన కుంబాల గణేశ్​ ముంబైలో  ఉంటాడు. స్వగ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో తన అన్న రాందాస్​తో భూ వివాదం నడుస్తోంది.

గణేశ్​కు చెందాల్సిన భూమిని అతడికి ఇవ్వకుండా రాందాస్ ​తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పంచాయితీలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో గణేశ్ ​ వేములకుర్తికి వచ్చిపోయే క్రమంలో మెట్​పల్లికి చెందిన హకీమ్, సయ్యద్ అక్రంతో పరిచయం ఏర్పడింది. విషయం వారికి చెప్పగా కలెక్టరేట్​లో పని చేస్తారంటూ నరేశ్, సద్దాం, మనోజ్, మారుతిని పరిచయం చేయించారు. వీరు రాందాస్​ భార్య  పేరిట ఉన్న భూమిని గణేశ్​ పేరిట మార్చి పట్టా చేస్తారని చెప్పారు. రూ. 20 లక్షలు ఖర్చవుతుందని చెప్పి రూ.12 లక్షలు తీసుకున్నారు.

డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్నా పని చేయడం లేదు. దీంతో గణేశ్ ​ఫిర్యాదుతో హకీమ్, అక్రం, నరేశ్​, సద్దాం, మనోజ్, మారుతీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కేసులో జగిత్యాల మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగి మారుతి ఉండడం చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు కాగా, డీఎస్పీ ఉమామహేశ్వర్​ రావు విచారణ జరిపారు.