ముగిసిన గ్రామ, వార్డు సభలు

ముగిసిన గ్రామ, వార్డు సభలు
  • ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు భారీగా దరఖాస్తులు
  • లబ్ధిదారుల జాబితాల్లో గందరగోళం.. పలు గ్రామాల్లో నిరసనలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. ఈ గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులు వేలల్లో వెల్లువెత్తాయి.  గ్రామసభల్లో అర్హుల జాబితాను చదివి వినిపించి అర్హుల పేర్లను ఆమోదించగా.. జాబితాలో పేర్లు రాని వారు దరఖాస్తు చేసుకున్నారు. అర్హత కలిగిన కొందరి పేర్లు జాబితాల్లో కనిపించకపోవడంతో పలు గ్రామాల్లో జనం నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు 26 నుంచి నాలుగు పథకాలను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  

జిల్లాలవారీగా దరఖాస్తులు ఇలా..

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 19,950, రేషన్ కార్డుల కోసం 23,112, ఆత్మీయ భరోసా కోసం 6,584 కొత్త అప్లికేషన్లు వచ్చాయి. జగిత్యాల జిల్లాలో రేషన్ కార్డుల కోసం 27,858, ఇందిరమ్మ ఇళ్ల కోసం 19,720, ఆత్మీయ భరోసా కోసం 9,601, రైతు భరోసా కోసం 1,069 దరఖాస్తులు అందాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ కార్డుల కోసం 16,505, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14,542, రైతు భరోసా కోసం 141, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 9,172 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలను శుక్రవారం రాత్రి వరకు అధికారులు వెల్లడించలేదు.

కొనసాగిన ఆందోళనలు 

గొల్లపల్లి, వెలుగు: గొల్లపల్లి మండలకేంద్రంలో అనర్హుల పేర్లు లిస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో వచ్చాయని ఆరోపిస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అర్హుల పేర్లు రాలేదని మహిళలు అధికారులపై మండిపడ్డారు. రాఘవపట్నంలో 51 మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయని, ప్రజపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా తోపులాట జరగగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేరుకొని గ్రామస్తులను శాంతింపజేశారు.