భద్రాచలం, వెలుగు: పోలవరంతో భద్రాచలానికి ముప్పు ఉందని, నిపుణులతో కమిటీ వేసి రీసర్వే చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భద్రాచలం డివిజన్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కరకట్ట ఎత్తును పెంచి పొడిగించాలని అన్నారు. ముంపు కాలనీ ప్రజలను ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు వివరించకుండా సర్వే పేరుతో సంతకాలు సేకరరించడం కరెక్ట్ కాదని, గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనర్సారెడ్డి, బ్రహ్మాచారి, మర్లపాటి రేణుక, టౌన్ సెక్రటరీ గడ్డం స్వామి, వెంకట్‌రెడ్డి, బండారు శరత్‌బాబు, సున్నం గంగ, వెంకట రామారావు, సంతోష్‌కుమార్, లీలావతి పాల్గొన్నారు.
ఆది ఆదర్శ్ పథకానికి 64 గ్రామాలు ఎంపిక
భద్రాచలం,వెలుగు: ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ పథకం కింద భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 64 గ్రామాలు ఎంపికయ్యాయని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో ఆఫీసర్లతో రివ్యూ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. ఒక్కో గ్రామానికి రూ.20 లక్షలు రిలీజ్ చేస్తారని, వాటితో విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, మంచినీరు, అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలు, కరెంట్, గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అన్ని అవసరాలకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. మొదటి విడతగా 20 గ్రామాలకు, రెండో విడతలో మరో 20 గ్రామాలకు నిధులు ఇస్తారని తెలిపారు. వారం రోజుల్లో ప్రపోజల్స్ తయారు చేసి ఇవ్వాలని డీఆర్డీవో మదన్‌గోపాల్‌ను పీవో ఆదేశించారు.
కొత్తగూడెం నుంచే పోటీ చేస్తా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కొంత మంది తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొత్తగూడెంలో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
పోరాడే సంఘాన్నే గెలిపించాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఎస్ఎన్ఎల్ ఎన్నికల్లో ఉద్యోగుల హక్కులు, సంస్థ పరిరక్షణకు పోరాడే సంఘాన్నే గెలిపించాలని బీఎస్ఎన్ఎల్ ఈయూ ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ జె సంపత్‌రావు కోరారు. కొత్తగూడెంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే గుర్తింపు ఎన్నికల్లో బీఎస్ఎన్ఎల్ ఈయూని గెలిపించాలని కోరారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి. సాంబశివరావు, నాయకులు వీరస్వామి, నాగమల్లు, శ్రీనివాసరావు, శంకర్రావు పాల్గొన్నారు.
జాతీయ కార్మిక సంఘాల ద్రోహం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జాతీయ కార్మిక సంఘాలు ద్రోహం చేశాయని పలు కార్మిక సంఘాల లీడర్లు ఆరోపించారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏఐటీయూసీ, సీఐటీయూ మద్దతు ఇచ్చిన క్రమంలో కార్మికుల సమ్మెను ఆయా సంఘాలు నీరు గార్చాయన్నారు. జాతీయ కార్మిక సంఘాల తీరును కార్మికులంతా ఎండగొట్టాలని అన్నారు. జేఏసీ నాయకులు పి సతీష్, ఎల్. విశ్వనాథం, కె. సురేందర్, విజయ్, జాటోత్ కృష్ణ, గోపాల్‌రావు, రాజశేఖర్ పాల్గొన్నారు.
భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్
పెనుబల్లి, వెలుగు: మండలంలోని విఎం బంజర్ బుడగ జంగాల కాలనీలో మంగళవారం సాయంత్రం కల్లూరు ఏసీపీ వెంకటేశ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వెహికల్స్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. సత్తుపల్లి రూరల్, టౌన్ సీఐలు హనోక్, కరుణాకర్ ఎస్సైలు సూరజ్, సురేశ్, కొండలరావు, షాకీర్ పాల్గొన్నారు.
ఆఫీసర్స్ డుమ్మా
గుండాల, వెలుగు: మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన జరిగింది. సమావేశానికి 27 శాఖల ఆఫీసర్లు రావాల్సి ఉండగా, నాలుగు శాఖల ఆఫీసర్లు మాత్రమే హాజరయ్యారు. ఆఫీసర్లు రాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమవేశానికి సంబంధించి సమాచారం ఇవ్వలేదని సర్పంచులు మీటింగ్‌ను బైకాట్ చేశారు. నాలుగు శాఖల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
ఆమరణ దీక్షలు చేస్తాం
పాల్వంచ,వెలుగు: కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణం కోసం పని చేసిన తమకు ఆర్టీజన్లుగా అవకాశం కల్పించాలని నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వన్నాపురం శ్రీనివాసరావు, ఎస్ఏ రవూఫ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామని, యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా తరువాత ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. ఖాదర్ బాబా, పోటు ప్రవీణ్, గడ్డం సీతారాములు, లాలు, రాము, నాగేశ్వ రరావు, కుమార్ పాల్గొన్నారు.
లాభాలు వెంటనే ప్రకటించాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచినా లాభాలు ప్రకటించకపోవడం సరైంది కాదని ఏబీకేఎంఎస్(బీఎంఎస్) జాతీయ కార్యదర్శి పి.మాధవ్ నాయక్ అన్నారు. బీఎంఎస్ ఆఫీస్‌లో మంగళవారం సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలు ప్రకటించడంతో పాటు 35శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టి. నరేంద్రబాబు, పవన్‌కుమార్, సంగం చందర్, గణేశ్, విజేందర్, రాంసింగ్, బాలకృష్ణ, సతీశ్, ప్రకాష్, మోహన్ పాల్గొన్నారు.
గురుకులాల సిబ్బందికి శిక్షణ
పాల్వంచ,వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, ఇల్లందు పట్టణాల్లోని మైనారిటీ గురుకులాల వంట సిబ్బందికి నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల మైనారిటీ పాఠశాల విజిలెన్స్ ఆఫీసర్ జమీల్ పాషా హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ ఎండీ ముదాసిర్ హుస్సేన్, గురుకులాల ప్రిన్సిపాల్స్ కృష్ణ, ఎం యాదగిరి, పీవీ గీతాజ్యోతి
పాల్గొన్నారు.
వృద్ధులకు దుప్పట్లు అందజేత
సత్తుపల్లి, వెలుగు: సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు కొనకండ్ల సుధారాణి మంగళవారం 22 మందికి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మండలంలోని సత్యంపేటలో కొంతకాలంగా జ్వరాలతో ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. వారి పరిస్థితి తెలుసుకున్న సుధారాణి దుప్పట్లను అందజేశారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన
మణుగూరు, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ ముత్యం రమేశ్, ఎస్సై రాజ్‌కుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని సర్వాయి గుంపు గ్రామంలో పర్యటించి ఆదివాసీలకు బట్టలు, పండ్లు అందజేశారు. ఏ సమస్య వచ్చినా తమకు దృష్టికి తీసుకొని రావాలని, వెంటనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
వైరాలో మెగా రక్తదాన శిబిరం
వైరా, వెలుగు: ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తన చిన్న అల్లుడు జూపల్లి ప్రదీప్ కుమార్ జ్ఞాపకార్థం వైరాలోని కమ్మవారి కల్యాణ మండపంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తం అందించే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, మార్కెట్ చైర్మన్ రత్నం, వైస్ చైర్మన్ సీతారాములు, పసుపులేటి మోహన్ రావు, గుమ్మా రోశయ్య, వేమూరి అజయ్, ప్రకాష్ యాదవ్
పాల్గొన్నారు.
గడువులోగా సమాచారం ఇవ్వాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు సకాలంలో దరఖాస్తుదారులకు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ చెప్పారు. కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం ద్వారా 35 కేసులకు సంబంధించి సమాచారం అడిగిన ప్రజలు, పౌర సమాచార అధికారులతో మంగళవారం హియరింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దరఖాస్తుదారులు అడిగిన భాషలో సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సింగరేణి యాజమాన్యం తెలుగులో సమాచారం అడిగినా ఇంగ్లీష్‌లోనే ఇస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ విధంగా స్పందించారు. సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం, అరకొర సమాచారం ఇవ్వకపోవడంపై పలువురు ఆఫీసర్లకు ఫైన్ వేశామని చెప్పారు. చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. కమిషనర్‌ను కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, డీఆర్వోఅశోక్ చక్రవర్తి, ఏవో గన్యా, డీపీఆర్వోశ్రీనివాస్ కలిశారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
కారేపల్లి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు. మండలంలోని ఉసిరికాయలపల్లిలో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నేత శాంతికుమార్, మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్, గల్లా సత్యనారాయణ, కోనేరు సత్యనారాయణ, ఎర్నేని రామారావు, శ్యామ్ రాథోడ్, ధనసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం రూరల్, వెలుగు: పీఎంఈజీపీ స్కీం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు డీసీసీబీ ద్వారా అందిస్తున్న రుణాలను గొల్ల, కురుమలు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్ సూచించారు. రూరల్ మండలం పెద్దతండాలోని వంశీ కృష్ణ ఫంక్షన్ హాల్లో మంగళవారం గొర్రెల పెంపకం దారులు సంఘం, డోల్ దెబ్బ ఆధ్వర్యంలో రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర నేత జాయ మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు బారి మల్సూర్, కార్యదర్శి మేకల నాగేశ్వరరావు, మండల పశు వైద్యాధికారి డాక్టర్ హరీశ్ పాల్గొన్నారు.
సంతానలక్ష్మిగా అమ్మవారు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష్మీతాయారు అమ్మవారు మంగళవారం భక్తులకు సంతాన లక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. విశేష స్నపన తిరుమంజనం జరిగాక ఉత్సవమూర్తిని సంతానలక్ష్మిగా అలంకరించారు. ప్రత్యేక ఆరాధనలు జరిగాక సామూహిక కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం అభిషేకం చేసి తమలపాకులు, నిమ్మకాయలు, వడమాలలు నివేదించారు. హనుమాన్‌చాలీసా పారాయణం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామికి ప్రాకార మండపంలో నిత్య కల్యాణం జరిగింది. చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణం పారాయణం నిర్వహించారు. రెండో రోజు అయోధ్యకాండను పారాయణం చేశారు.
మంగళ గౌరీగా పెద్దమ్మ తల్లి..
పాల్వంచ: శరన్నవరాత్రుల్లో భాగంగా మండలంలోని కేశవాపురం–జగన్నాథపురంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు రెండో రోజు మంగళ గౌరీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో 21 మంది రుత్వికులచే లక్ష్మీ గణపతి అనుష్ఠానం, వేద పారాయణం, నవగ్రహ జపాలు నిర్వహించారు. ఎండోమెంట్ ఈవో సులోచన, దేవాలయ కమిటీ చైర్మన్ రామలింగం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ముత్యాల రమణమూర్తి పాల్గొన్నారు.
ఆలయాలకు అమ్మవారి చీరె, సారెపెద్దమ్మతల్లి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్వంచలోని పలు ఆలయాలకు పెద్దమ్మ తల్లి చీరె, సారె సమర్పించారు. ఈవో సులోచన ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మహిపతి రామలింగం, సభ్యులు చింత నాగరాజు, బండి చిన్న వెంకటేశ్వర్లు, బేతంశెట్టి విజయ్, కిలారు నాగ మల్లేశ్వరరావు, ముత్యాల ప్రవీణ్ కుమార్, ఎస్వీఆర్కే ఆచార్యులు మేళ తాళాలతో చీరె, సారెలను పట్టణంలోని 8 ఆలయాలకు తీసుకెళ్లి అక్కడి అమ్మవారి ప్రతిరూపాలకు సమర్పించారు.
కొణిజర్లలో ర్యాలీ
వైరా, వెలుగు: అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందించాలని గ్రామీణ పేదల సంఘం అధ్వర్యంలో కొణిజర్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానోత్ భద్యా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ రామచంద్రయ్య, జార ఆంజనేయులు, నెక్కిలి వెంకటేశ్వర్లు, అయినాల శ్రీను పాల్గొన్నారు.
దొంగల అరెస్ట్
రూ.2.46 లక్షల సొత్తు స్వాధీనం
అశ్వారావుపేట, వెలుగు: ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.46 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బాలకృష్ణ, ఎస్సై అరుణ తెలిపారు. ఏపీలోని లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన చింతలపూడి జస్వంత్ కుమార్, గుంటూరు జిల్లా నల్లపాడు మండలం గుజ్జనగుండ్ల గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వరరావు కలిసి మండలంలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు చెప్పారు. మంగళవారం వీరిని అరెస్ట్ చేసి 70 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.