- ఫేక్ ష్యూరిటీలతో బెయిల్ కు ప్రయత్నంముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
మిర్యాలగూడ, వెలుగు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్ మంజూరు కోసం కోర్టులో ఫేక్ ష్యూరిటీలు అందజేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక డీఎస్పీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రధాన నిందితుడు సుభాష్శర్మపై 8 ఏండ్లుగా విచారణ కొనసాగుతోంది.
సుభాష్ శర్మకు బెయిల్ వస్తే విచారణకు ఆటంకం ఏర్పడుతుందని గతంలో రెండు సార్లు న్యాయస్థానం క్యాన్సల్ చేసింది. ఈ క్రమంలో 2024 నవంబర్ లో యూటీ ప్రిజనర్ సుభాష్ శర్మ బెయిల్ కోసం అతడి తరఫు లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిగే నల్గొండ కోర్టులో ష్యూరిటీలు అందజేసి బెయిల్ పొందాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని లాయర్ ద్వారా తెలుసుకున్న కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వంగాల సైదులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖాళీ ష్యూరిటీ ఫారాలను కొనుగోలు చేసి పాములపహాడ్ గ్రామపంచాయతీ పేరిట నకిలీ ముద్రణలు తయారు చేశాడు. వాటితో నకిలీ ష్యూరిటీ పేపర్లను తయారు చేసి బెయిల్‌కోసం జిల్లా కోర్టులో అందజేశారు.
ఈ కేసును విచారణ చేస్తున్న నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు కాగితాల వెరిఫికేషన్ కు పోలీస్ ఉన్నతాధికారులకు పంపింది. దీంతో వారి ఆదేశాలతో వేములపల్లి మాడుగులపల్లి పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పాములపహాడ్ గ్రామ కార్యదర్శి మున్నా సైదులు.. తాను ష్యూరిటీ పత్రాలు జారీ చేయలేదని చెప్పారు. ఇదే విషయమై కార్యదర్శి వేములపల్లి పీఎస్ లో వంగాల సైదులు, పాములపహాడ్ గ్రామానికి చెందిన చింతచెర్ల దేవయ్య, ముక్కామల మల్లేశ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫేక్ ష్యూరిటీ తయారీలో వంగాల సైదులుపై పలు పోలీస్ స్టేషన్లలో 21 దొంగతనం కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ వీరబాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.