ముస్తాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఆదివారం నక్కదాడిలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఆదివారం ఉదయం ఇంటి ముందు కల్లాపి చల్లుతున్న సూత్రం రాధపై (34) నక్క ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
పొలం పనులకు వెళుతున్న దీటి సత్తయ్య (40), మరో వ్యక్తి తెర్లుమద్ది కిషన్ (32) పై దాడి చేసింది. నక్క దాడిలో గాయపడ్డ బాధితులను సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నక్క ను గ్రామస్తులు కొట్టి చంపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన క్షతగాత్రులను సిరిసిల్ల సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు.