బీజేపీలో టికెట్‌‌ ఫైట్‌‌.. మస్త్‌‌ కాంపిటీషన్‌‌

బీజేపీలో టికెట్‌‌ ఫైట్‌‌.. మస్త్‌‌ కాంపిటీషన్‌‌

వరంగల్‍, వెలుగు :  బీజేపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకునేందుకు గ్రేటర్‌‌ వరంగల్‌‌ లీడర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా వరంగల్‍ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేందుకు సీనియర్లతో పాటు, ఇటీవలే పార్టీలో చేరిన వారు సైతం ఆసక్తి చూపుతున్నారు. టికెట్‌‌ కోసం ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకోగా, మరో రెండు రోజులు గడువు ఉండడంతో అప్లై చేసుకునేందుకు మరికొందరు రెడీ అవుతున్నారు. 

ఈస్ట్‌‌లో గెలుపు ఈజీ అంటూ...

వరంగల్‌‌ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ సర్వేలో తేలడంతో ఇక్కడి టికెట్‌‌ కోసం ఆ పార్టీ లీడర్ల మధ్య పోటీ పెరిగింది. ఇక్కడి నుంచి టికెట్‌‌ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు పేరు వినిపిస్తోంది. నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న బలానికి తోడు బీఆర్‌‌ఎస్‌‌లో ఉన్న టైంలో తోడుగా ఉన్న కార్పొరేటర్లు, సీనియర్లు, కేడర్‍తో పాటు చిరంజీవి ప్రజాసేన కేడర్‍, పవన్‌‌ కల్యాణ్‌‌ అభిమానులు తనకు సపోర్ట్‌‌ చేస్తారని ప్రదీప్‌‌రావు ధీమాగా ఉన్నారు. 

సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍పై అసంతృప్తితో ఉన్న వారు తనతో కలిసి వస్తారని నమ్మకంతో ఉన్నారు. ఇక నియోజకవర్గంలో పద్మశాలి ఓట్లు ఎక్కువగా ఉన్నందును ఆ సామాజికవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ కార్పొరేటర్‍ కుసుమ సతీశ్‌‌, ఇదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‍ వన్నాల వెంకటరమణ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు మున్నురుకాపు నుంచి గంట రవికుమార్‌‌, సామాజిక వర్గం నుంచి అడ్వకేట్‍ అల్లం నాగరాజు సైతం టిక్కెట్‍ రేసులో ఉన్నారు. 

వెస్ట్‌‌ టికెట్‌‌పై టెన్షన్‌‌

వరంగల్‍ వెస్ట్‌‌ నియోజకవర్గ టిక్కెట్‍ విషయంలో సీనియర్ల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి టిక్కెట్‍ ఆశించేవారంతా క్రేజ్‌‌ ఉన్నవారే కావడంతో ఎవరికి వారుగా హైకమాండ్‌‌ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రావు పద్మ ఈ సారి టికెట్‌‌ తనదేనన్న ధీమాతో ఉన్నారు. అయితే యూత్‌‌ ఫాలోయింగ్‌‌, దూకుడుతత్వంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‍రెడ్డి రావు పద్మకు ప్రధాన పోటీదారుగా మారారు. 

సర్వేలు తనకే అనుకూలంగా ఉంటాయన్న నమ్మకంతో రాకేశ్‌‌రెడ్డి ఉన్నారు. ఢిల్లీ స్థాయి నేతలతో పరిచయాలు ఉన్న మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు సైతం ఈ నియోజకవర్గం టికెట్‌‌నే ఆశిస్తున్నారు. ఈయన ఇటీవలే పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌‌గా ఎంపికయ్యారు. వీరితో పాటు మాజీ జడ్పీటీసీ కోరబోయిన సాంబయ్య, చాడ శ్రీనివాస్‍రెడ్డి, రావుల కిషన్‌‌ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

కీలకంగా మారనున్న సర్వే

అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపికను సర్వేలు నిర్దేశిస్తున్నందున బీజేపీ సైతం అదే ఫార్ములాతో ముందుకు వెళ్తోంది. ఎమ్మెల్యే ప్రవాసీ యోజనలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటించిన వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు పార్టీ, క్యాండిడేట్ల బలబలాలపై రిపోర్ట్‌‌ ఇచ్చారు. టిక్కెట్‍ పోటీ ఎక్కువగా ఉండే చోట్ల సెంట్రల్‍, స్టేట్‍ పార్టీ చేయించిన సర్వేలు ఎఫెక్ట్‌‌ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్ర స్కీమ్‌‌లు కలిసొస్తాయంటూ...

గ్రేటర్‌‌లో గతంలో బీజేపీకి ఒక్కరే కార్పొరేటర్‌‌ ఉండగా గత కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో పది స్థానాలు గెలుచుకుంది. దీంతో నగరంలో పార్టీ బలం పెరిగినట్లైంది. మరో వైపు స్మార్ట్‌‌ సిటీ, అమృత్‍, హృదయ్‌‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో పాటు, అధికార పార్టీ సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని నమ్ముతున్నారు. దీంతో ఈ సారి ఎలాగైనా టికెట్‌‌ దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. హైకమాండ్‌‌ వద్ద ఉన్న పట్టుతో కొందరు, ప్రజాదరణతో మరికొందరు, క్యాస్ట్‌‌ ఈక్వేషన్‌‌తో ఇంకొందరు తమకు తెలిసిన లీడర్ల ద్వారా హైకమాండ్‌‌ వద్ద పైరవీలు చేస్తున్నారు.