
తిరుమలలో భక్తులను మోసగించే కేటుగాళ్ల భరతం పడుతున్నారు తిరుమల పోలీసులు. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీ నంటూ .. వీఐపీ దర్శనం ఇప్పిస్తానని భక్తులను మోసం చేసిన కేటుగాళ్లపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమొదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
విజయవాడ సిద్ధార్థ కళాశాల పిజి స్టూడెంట్ సంఘమిత్ర అనే బాధితురాలు ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. మదలదీపు బాబు, పవన్ కుమార్ లు తనకు 5 విఐపీ బ్రేక్ దర్శనం, 5 సుప్రభాత సేవా టిక్కెట్లు ఇప్పిస్తానని 2.6 లక్షల రూపాయిలు ఫోన్ పే ద్వారా వసూలు చేసి మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదుతో నిందితులు మదలదీపు బాబు, పవన్ కుమార్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘమిత్ర లాగా ఇంకెంతమంది భక్తులను మోసగించారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
తిరుమల అంటే అందరికీ ఎంతో ప్రత్యేకమైనది, పవిత్రమైనది. కలియుగ దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. అయితే ఇందుకోసం కొంత శ్రమ పడాల్సి వస్తుంది. మనం వెళ్లాలనుకునే సమయానికి టికెట్లు దొరకవు. దీంతో సిఫారసు లేఖలు పొందే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని అనేకమంది భక్తులను మోసం చేస్తూ ఉంటారు.
భక్తులకు నకిలీ టికెట్లు అంటగట్టడం, టికెట్ ధరలను అధిక మొత్తంలో వసూలు చేయడం లాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉంటాయి. టీటీడీ అధికారులు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటారు. ఈ మోసాలకు పాల్పడిన వారిపై పోలీసు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తూనే ఉంటారు. అయినా ఇవి కొనసాగుతూనే ఉంటాయి.