పొగాకును కట్టడి చేయాల్సిందే

మద్యపానం, ధూమపానాలు భారతజాతి సంక్షేమాన్ని, సౌభాగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న వ్యసనాలు కాగా అందులో మొదటిది పిశాచమౌతే, రెండవది దెయ్యమని మహాత్మాగాంధీ ఎప్పుడో సెలవిచ్చారు. పొగాకు ఆధునిక సమాజానికి పట్టిన ఒకపెద్ద శాపం. యువత దాని బారినపడి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతోంది. సిగరెట్, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా, చుట్టా, బీడీ, జర్దా ఇలా వివిధ రూపాల్లో పొగాకు ప్రజారోగ్యాన్ని దెబ్బతిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల కన్నా, మాదక ద్రవ్యాల వాడకం వల్ల అర్దాయుష్కులవుతున్న అభాగ్యుల సంఖ్యే అధికమని,2030 నాటికి పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం సగటు భారతీయుడిని కలవరపరిచే విషయం.

క్యాన్సర్ కారకాలు

ప్రపంచంలో చైనా మూడు మిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా పొగాకు ఉత్పత్తిచేసి మొదటి దేశంగా ఆవిర్భవిస్తే, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో ఇండియా కొనసాగుతున్నాయి. చైనా తర్వాత ధూమకేతులు అత్యధికంగానున్న దేశం భారత్ కాగా, వారిలో దాదాపు 57శాతం పురుషులు,11శాతం మహిళలు ఏదో విధంగా పొగాకు తీసుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. ఇండియాలో12 కోట్ల మందికిపైగా ధూమకేతులుండగా, మరో18.5 కోట్ల మంది పొగాకు ఉత్పత్తుల వినియోగదారులున్నారు. పొగాకు వల్ల ప్రపంచంలో ఏటా దాదాపు 80 లక్షల మంది నుంచి కోటి వరకు మరణిస్తున్నారు. భారతదేశంలో ప్రత్యక్ష, పరోక్ష ధూమపానం వల్ల ఏటా సుమారు12 లక్షలమంది ప్రజలు మరణిస్తే, స్మోక్ లెస్ పొగాకు వల్ల 2.5 లక్షల మంది ప్రభావితం అవుతున్నారని, దీనివల్ల 90 శాతం క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి. 

ప్రమాదకర రసాయనాలు

పొగాకు ఉత్పాదకాల్లో నికోటిన్, సీసం, ఆర్సినిక్, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా తదితర 400కు పైగా రసాయనాలతోపాటు ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థం లాంటివి ఉంటాయని, వాటిలో 200 రసాయనాలు ప్రమాదకరమైనవి కాగా, అందులో 20కి పైగా క్యాన్సర్ కారకాలున్నాయని పలు పరిశోధనలు శాస్త్రీయంగా వెల్లడించాయి. పొగాకు వినియోగం ప్రాణాంతకమని ప్రచారోద్యమాలు సాగుతున్నా.. పొగాకు ఉత్పతుల వినియోగం పెరిగి ఏటా లక్షలమంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని తేల్చిన ప్రజా ఆరోగ్య ఫౌండేషన్ అధ్యయనం సగటు మానవున్ని కలవరపెడుతోంది. ధూమపానానికి వ్యతిరేకంగా 1988 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో ప్రచారోద్యమం చేపట్టింది. వాటి నుంచి వెలువడే దుష్ఫలితాల నుంచి ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో 1988 మే 31న “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” నిర్వహిస్తోంది. 2006లో సుప్రీంకోర్టు యువతరం మత్తుపానీయాలకు బానిస అవుతోందని వ్యాఖ్యానించింది.‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకునేది’  అంటూ అప్పటి ప్రభుత్వానికి చురకలంటించింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు పొగాకు రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించడం కోసం రూ.5 వేల కోట్లతో కార్యక్రమం ప్రకటించింది. కానీ ఎన్నో పథకాల మాదిరిగానే అది కూడా అమలు కాలేదు.  

కఠిన చట్టాలు రావాలె..

చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో మాదక ద్రవ్యాల అక్రమరవాణా, విక్రయాల నేరారోపణలు రుజువైతే మరణశిక్షలు విధించే చట్టాలు అమలులో ఉన్నాయి. మనదేశంలోనూ కఠినమైన చట్టాలను తీసుకువచ్చి చిత్తశుద్ధితో అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- డా. పోలం సైదులు,
సోషల్​ ఎనలిస్ట్