హైదరాబాద్: తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్ లకు క్లీన్ చిట్ వచ్చింది. డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తూ.. వారి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ లేబోరొటేరీకి పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసు తొలుత వెలుగులోకి వచ్చినప్పుడు 2017 జులై నెలలో ఎక్సైజ్ శాఖ దర్శకుడు పూరి జగన్నాత్ తోపాటు హీరో తరుణ్ నుంచి శాంపిల్స్ సేకరించారు. తమ ఆరోపణలకు స్పందించి వారు స్వచ్ఛందంగా గోళ్లు, వెంట్రుకలు ఇచ్చారని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఈ శాంపిల్స్ ను పరీక్షించిన ఎఫ్ఎస్ఎల్ నమూనాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చిందని వారు తెలిపారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని వారికి డ్రగ్స్ సరఫరా చేసిన సూత్రధారి కెల్విన్ పై చార్జిషీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు, ఈ చార్జిషీట్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా జత చేసి కోర్టుకు సమర్పించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నివేదికతోపాటు ఎఫ్ఎస్ఎల్ అధికారి వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించామని వారు వివరించారు.