ఈ మధ్య మిల్లెట్స్ మీద ప్రేమ ఓ రేంజ్లో పెరిగిపోయింది జనాలకు. అలాగని రైస్‌ను తక్కువ చేయడం లేదు. కానీ నేటి మోడర్న్ లైఫ్స్టయిల్లో శారీరకశ్రమ బాగా తగ్గిపోయింది. అందుకని అన్నం తిని కూర్చుంటే పలురకాల అనారోగ్య సమస్యలు ‘తిని తెచ్చుకున్నట్టు’ అవుతోంది. అందుకే అన్నంకి ప్రత్యామ్నాయంగా ‘వి లవ్ మిల్లెట్స్’ అంటున్నారు ఎక్కువమంది. మిల్లెట్స్‌ను కూడా అన్నం లాగే వండుకోవచ్చు.. నచ్చిన కూరగాయల్ని జతచేర్చి కూడా. విడిగా కూర వండుకునే పనికూడా ఉండదు. అందుకే కొన్ని రకాల మిల్లెట్స్ వంటలు ఇవి. వండుకున్నాక దాని పేరు కిచిడీ, పులావ్, వెజిటబుల్ మిల్లెట్ రైస్... ఇలా ఏమన్నా మీ ఇష్టం!
..ఇవి గుర్తుంచుకోవాలి
- జొన్నల్ని మరీ మెత్తగా ఉడికించొద్దు.
- జొన్నలు కాస్త క్రంచీగా కాకుండా మెత్తగా ఉండాలంటే మాత్రం ఎక్కువ టైం ఉడికించాలి.
- కాయగూరలు మీకు నచ్చినవి వాడొచ్చు.
- ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసుకోవాలంటే కూడా వాటిని వేయకుండా వండొచ్చు. తడ్కా తరువాత కాయగూరల ముక్కలు వేస్తే సరిపోతుంది.
- బయట దొరికే ఇంగువలో గోధుమ కలుస్తుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ కాదు. అందుకని గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్లు ఇంగువ వేయకుండా చేసుకోవచ్చు. లేదా గ్లూటెన్ ఫ్రీ ఇంగువ వాడొచ్చు.
జొన్నలతో...
కావలసినవి :
జొన్నలు - అర కప్పు
నీళ్లు - రెండు కప్పులు
క్యారెట్ లేదా నచ్చిన కాయగూర (తరుగు) - పావు కప్పు
బీన్స్ తరుగు - పావు కప్పు
టొమాటో - ఒకటి
ఉల్లిపాయ (తరిగి) - ఒకటి(ఇష్టపడితే)
వెల్లుల్లి (తరిగి) - రెండు రెబ్బలు(నచ్చితేనే)
అల్లం (తరిగి) - చిన్న ముక్క
పచ్చిమిర్చి(తరిగి) - ఒకటి(రుచిక సరిపడా)
కొత్తిమీర తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - పావు టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
కరివేపాకులు - కొన్ని
నూనె - ఒక టేబుల్ స్పూన్
ఇంగువ - అర టీస్పూన్ (గ్లూటెన్ ఫ్రీ)
తయారీ : జొన్నల్ని శుభ్రం చేసి, కడిగి వీలైతే ఒక రోజంతా లేదంటే పది గంటలు నానబెట్టాలి. తరువాత వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే జొన్నలు మెత్తబడేందుకు కొంచెం టైం పడుతుంది. ఒకవేళ కుక్కర్లో ఉడికించడం నచ్చకపోతే మందపాటి గిన్నెలో నానబెట్టిన జొన్నలు వేసి నీళ్లలో ఉడికించుకోవచ్చు. ఇలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది. జొన్నలు ఉడికించిన నీళ్లను పారబోయకుండా తరువాత వంటలో వాడేందుకు పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం తరుగు వేయాలి. మీడియం మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఉల్లి తరుగు ఉడికాక కూరగాయలు, టొమాటోల తరుగు వేసి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత ఉడికించి పక్కన పెట్టిన జొన్నలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి, జొన్నలు ఉడికించిన నీళ్లు ఒక కప్పు పోయాలి. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మీడియం మంట మీద పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికిస్తే జొన్నల పులావ్ రెడీ. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
కొర్రలతో
కావలసినవి :
కొర్రలు - అర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - తగినంత
నెయ్యి లేదా నూనె - ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్
క్యారెట్, బీన్స్, పచ్చి బటానీ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ - అర లేదా ముప్పావు కప్పు కాయగూరల తరుగు
పుదీనా ఆకులు - కొన్ని
అల్లం తరుగు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
మసాలా దినుసులు బిర్యానీ ఆకు - ఒకటి
ఆకుపచ్చని యాలక్కాయలు - రెండు
లవంగాలు - నాలుగు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అనాస పువ్వు చిన్నది - ఒకటి
జాపత్రి - ఒకటి
షాహి జీరా - పావు టీస్పూన్
తయారీ : కొర్రలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చని నీళ్లలో ఒక గంట నానబెట్టాలి. పాన్‌లో నూనె వేడిచేసి మసాలా దినుసుల్ని వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. తరువాత కూరగాయల ముక్కలు, పుదీనా వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు వేగించాలి. పచ్చి వాసన పోతుంది. నీళ్లు పోసి ఉప్పు సరిపడా వేయాలి. అవి ఉడుకు వచ్చాక నానబెట్టిన కొర్రల్లో నీళ్లు వంపేసి వడకట్టిన కొర్రలను ఉడుకుతున్న నీళ్లలో వేయాలి. ఓ మాదిరి లేదా తక్కువ మంట మీద అవి ఉడికే వరకు ఉంచాలి. అవి ఉడికాక ఏమైనా కాస్త తేమ ఉంటే మంట పెంచి నీళ్లు ఆవిరి అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. మూతపెట్టి సరిగ్గా ఏడు నిమిషాలు అలానే ఉంచాలి. తరువాత కొర్రల పులావ్‌ని రైతా కాంబినేషన్లో తినాలి.
అరికెలతో
కావలసినవి :
అరికెలు - ఒక కప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు
క్యారెట్, బీన్స్, పచ్చి బటానీలు - ఒక కప్పు(అన్నీ కలిపి)
ఉల్లిపాయ - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు, పుదీనా ఆకులు - పన్నెండు
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకు కావలసినవి
నెయ్యి, నూనె కలిపి - 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క, సోంపు - ఒక టీస్పూన్
బిర్యానీ ఆకు - ఒకటి
తయారీ : నెయ్యి, నూనెల మిశ్రమాన్ని ప్రెషర్ కుక్కర్లో వేడి చేయాలి. స్టవ్ మంట తగ్గించి దాల్చిన చెక్క, సోంపు, బిర్యానీ ఆకు వేగించాలి. సోంపు రంగు మారకముందే ఉల్లి తరుగు వేయాలి. అవి కాస్త వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి. తరువాత కూరగాయల తరుగు, పుదీనా ఆకులు వేసి ఓ మాదిరి మంట మీద రెండు నిమిషాలు వేగించాలి. తరువాత కూరగాయల ముక్కల్లో ఉప్పు కొంచెం వేయాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరికెలు వేసి బాగా కలపాలి. పొడి పొడిగా కానివ్వాలి. స్టవ్ మంట మీడియంలోనే ఉంచాలి ఈ వంట చేస్తున్నంతసేపు. పొడిపొడిగా అయిన మిశ్రమంలో నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. బాగా కలిపి కుక్కర్లో పెట్టి మీడియం మంట మీదనే ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. లేదంటే తక్కువ మంట మీద పన్నెండు నిమిషాలు ఉడికించాలి.
ఊదలతో...
కావలసినవి :
ఊదలు - ఒక కప్పు
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
ఆలుగడ్డలు - 200 గ్రాములు
పచ్చిమిర్చి(తరిగి) - రెండు
పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టీస్పూన్
కరివేపాకులు - పది
సైంధవ లవణం (రాక్ సాల్ట్) - అర టీస్పూన్
కొత్తిమీర (తరుగు) - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక కప్పు ఊదలను శుభ్రంగా నీళ్లలో కడిగి పక్కన పెట్టాలి. నెయ్యి వేడి చేసి జీలకర్ర, కరివేపాకులు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగాక ఓ మాదిరిగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. అందుకు కొన్ని నిమిషాల టైం పడుతుంది. తరువాత కడిగి పెట్టుకున్న ఊదలు వేసి కొన్ని నిమిషాలు అటు ఇటు గరిటెతో కలపాలి. తరువాత రెండున్నర కప్పులు నీళ్లు పోసి సైంధవ లవణం వేసి బాగా కలపాలి. మూతపెట్టి మంట తగ్గించేయాలి. తక్కువ సెగ మీదనే ఏడెనిమిది నిమిషాలు ఊదలు ఉడికించాలి. నీళ్లను పీల్చుకున్న ఊదలు ఉబ్బుతాయి. అప్పుడు ఊదల పులావ్ రెడీ అయినట్టు. పైనుంచి వేగించిన పల్లీలు వేసి, కొత్తమీర చల్లుకుని తినడమే తరువాయి.