ఏరు ఫెస్టివల్ కు రెడీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు

 ఏరు ఫెస్టివల్ కు రెడీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు
  • నేటి నుంచి మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు    
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్​కు ఇది తొలి అడుగు

భద్రాచలం, వెలుగు : ఏరు ఫెస్టివల్​ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్​కు తొలి అడుగు పడింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాకు వచ్చే టూరిస్టులకు ఏజెన్సీ అందాలు కనువిందు చేయనున్నాయి. ఇందు కోసం ఏర్పాట్లన్నీ కలెక్టర్​జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్​దగ్గర ఉండి పూర్తి చేయించారు.

ప్రత్యేక ప్యాకేజీలు..

భద్రాచలంలో ప్రారంభమయ్యే ఈ టూరిజం ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.6వేలు, పిల్లలకు రూ.4వేలు చొప్పున ధర నిర్ణయించారు. భద్రాచలంలో రాత్రి కరకట్ట కింద ఉన్న గుడారాల్లో బస చేస్తారు. రాత్రి డిన్నర్​ ఆదివాసీ వంటకాలతో ఉంటుంది. గోదావరిలో బోటింగ్, తీరంలో వేదికపై కల్చరల్​ ప్రోగ్రామ్​లు తిలకిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 స్టాళ్లలో ఆదివాసీ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు కొనుగోలు చేసుకునేలా సిద్ధం చేశారు. 

తెల్లారి భద్రాద్రి సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం వాహనంలో కిన్నెరసాని ప్రాజెక్టుకు వెళ్తారు. పడవల్లో విహరించి ఆనంద ద్వీపం, జింకలపార్కును తిలకిస్తారు. తిరిగి భద్రాచలం చేరుకుని ఆదివాసీ వంటకాలతో లంచ్ తర్వాత ఐటీడీఏలో ట్రైబల్​ మ్యూజియానికి వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుంచి దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప ఆదివాసీ విలేజ్​కు వెళ్తారు. అక్కడ రేలా నృత్యాలతో అతిథులను స్థానికులు ఆహ్వానిస్తారు.

 ప్రత్యేక వేదికపై ట్రైబల్​ నృత్యాల ప్రదర్శన ఉంటుంది. పల్లెటూరి అందాలు ఆస్వాదిస్తారు. చెరువులో చేపల వేట, ఆదివాసీ వంటకాలతో రాత్రి డిన్నర్,​ ఆటపాటలతో సేదతీరుతారు. రాత్రి తిరిగి భద్రాచలంలో గుడారాలకు చేరుతారు. మూడో రోజు తెల్లవారి బెండాపాడుకు చేరి కనకగిరి కొండల ట్రెక్కింగ్​చేసి లంచ్ అయ్యాక తిరిగి తమ గమ్యస్థానాలకు టూరిస్టులు బయలుదేరి వెళ్తారు. 

ఈ ప్యాకేజీ తర్వాత కూడా కొనసాగుతుంది..

మూడు రోజుల ఏరు ఫెస్టివల్​ తర్వాత కూడా ఈ ప్యాకేజీ కొనసాగుతుంది. మార్చినెలలో కూడా సెల్ఫ్​ హెల్ప్ గ్రూపుల ద్వారా ఏరు టూరిజాన్ని మరింత డెవలప్​ చేస్తాం. జిల్లాలోని ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ టూరిజం స్పాట్లను రెడీ చేస్తాం. జిల్లాకు వచ్చిన టూరిస్టులు మంచి అనుభూతితో వెళ్లేలా ప్లాన్​ చేశాం.    - జితేశ్​వి పాటిల్, కలెక్టర్, భద్రాద్రికొత్తగూడెం