ప్రతి గ్రామంలో నెలరోజులు సంబరాలు

ప్రతి గ్రామంలో నెలరోజులు సంబరాలు
  • బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున ప్రచారం చేయండి
  • నేతలకు టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్  పిలుపు

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్  గౌడ్  పిలుపునిచ్చారు. మంగళవారం జూమ్  మీటింగ్ లో నిర్వహించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీచేసిన అభ్యర్థులు, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ రెండు రోజులుగా అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నామన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదన్నారు. కాంగ్రెస్  పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్‌‌ను ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

ఇప్పుడు చేసుకున్న రెండు తీర్మానాలు సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినపుడు ఎంత సంతోషపడ్డమో ఇప్పుడు అంత సంతోషంగా ఉందన్నారు. ఇంత సంతోషాన్ని పల్లెల్లో ఇంటింటికి పంచాలని, పెద్ద ఎత్తున సంబురాలు జరపాలని ఆయన సూచించారు. నెల రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించాలన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జైబాపు, జై భీమ్, జై సంవిధాన్  అభియాన్  కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు.