- పత్తికి ఎక్కువ రేటు వస్తుండడంతో ఏకమైన వ్యాపారులు
- మాయిశ్చర్ సాకుతో ధర తగ్గించే యత్నాలు
- కటాఫ్ కు 8 శాతం.. ఆపై పాయింట్ కు కిలో తరుగుకు నిర్ణయం
- ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆగ్రహించిన రైతులు
- మహారాష్ట్ర వ్యాపారులకు లేని నిబంధన ఇక్కడ ఎందుకని ఆగ్రహం
ఆదిలాబాద్, వెలుగు: ఈ ఏడాది పత్తికి మంచి ధర పలుకుతోందని సంతోషించిన రైతులకు ఆదిలాబాద్మార్కెట్యార్డులో తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ఇంత రేటు ఎందుకు పెట్టాలనుకున్నారో ఏమో, వ్యాపారులంతా ఏకమయ్యారు. తేమ పేరిట కోతలు పెడుతూ కొత్త లెక్కలు చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. పక్కనున్న మహారాష్ట్రలో మాయిశ్చర్‌తో సంబంధం లేకుండా వ్యాపారులు క్వింటాల్‌కు రూ.8 వేలు పెడుతుంటే, అక్కడికంటే తక్కువ ధర పెడుతున్న ఇక్కడి వ్యాపారులు, తేమ పేరిట 8 శాతం కటాఫ్ పెట్టడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. సోమవారం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిసి మార్కెట్‌కు వివిధ వాహనాల్లో తెచ్చిన కాటన్లో సరాసరి 15 శాతం మాయిశ్చర్ఉందని, ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.6,365 మాత్రమే దక్కుతుందని తెలిసి మార్కెట్‌యార్డులోనే ఆందోళనకు దిగారు. ఇది చాలదన్నట్లు మార్కెట్ యార్డులో ఒకసారి, జిన్నింగ్‌లో మరోసారి మాయిశ్చర్టెస్ట్ చేయాలని ట్రేడర్స్ చెప్పడంతో మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు కిసాన్ చౌక్‌లో ధర్నా చేశారు. ఇలా తొలిరోజు ఆదిలాబాద్మార్కెట్యార్డులో వ్యాపారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా పత్తిరైతుల్లో చర్చ మొదలైంది.
ఇంటర్ నేషనల్ మార్కెట్లో మంచి ధర..
కరోనా తర్వాత మూతపడ్డ టెక్స్టైల్స్ ఇండిస్ట్రీస్ అన్నీ తెరుచుకోవడంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ బేళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో బేల్‌కు రూ.40 వేల దాకా పలుకుతోందని ట్రేడర్స్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రేటు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు భారీ వర్షాల వల్ల మిగిలిన రాష్ట్రాల్లో కాటన్దిగుబడులు అంతగా రాకపోవడంతో అందరి దృష్టి మన పత్తిపైనే పడింది. ఈక్రమంలోనే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో బార్డర్ గ్రామాల్లో పండిన పత్తిని మహారాష్ట్ర వ్యాపారులు ఎలాంటి తేమ కొర్రీలు లేకుండా క్వింటాల్‌కు రూ. 8వేల దాకా పెట్టి కొంటున్నారు. తాజా పరిస్థితుల్లో రైతుకు రూ. 8 వేలకుపైగా ధర ఇచ్చినప్పటికీ వ్యాపారులకు భారీగానే మిగులుతుందని కాటన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒక్కో బెల్ తయారు చేయడానికి ట్రేడర్స్ 5 క్వింటాళ్ల పత్తిని వినియోగిస్తారు. ఇందులో 170 కిలోల లింట్ (క్వాలిటీ కాటన్), 325 కిలోల సీడ్ వస్తుంది. లింట్ ద్వారా తయారయ్యే బెల్ కు రూ. 40 వేలు రాగా, 325 కిలోల సీడ్‌కు క్వింటల్‌కు రూ.3,300 లెక్కన మరో రూ.10వేలకుపైగా వస్తాయి. ఈలెక్కన 5 క్వింటాళ్ల పత్తిపై ట్రేడర్ రూ.50 వేలవరకు సంపాదిస్తాడు. రైతుకు రూ.8వేల చొప్పున రూ.40 వేలు పోయినా సీడ్‌పై వచ్చే రూ.10 వేలు మిగులుతుంది.
ఆదిలాబాద్‌లో రోజంతా ఆందోళన
ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తెల్లారేసరికి ఉమ్మడి ఆదిలాబాద్ నలుమూలల నుంచి రైతులు మార్కెట్‌కు వివిధ వాహనాల్లో కాటన్తెచ్చారు. కాగా, వ్యాపారులు మాయిశ్చర్ పేరిట 8 శాతం కటాఫ్ పెడుతామని చెప్పారు. కాటన్లో సరాసరి 15 శాతం మాయిశ్చర్ఉందని, ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.6,365 మాత్రమే దక్కుతుందని తెలిసిన రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8 శాతం మాయిష్చర్ ఉన్న కాటన్‌ను రూ.7,970 చొప్పున కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఒప్పుకున్నారు. దీంతో గంట ఆలస్యంగా ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఆఫీసర్లు, ట్రేడర్స్, రైతుల సమక్షంలో వేలంపాట మొదలైంది. రూ.7,400 నుంచి మొదలైన వేలం రూ.7,920 వద్ద ఆగింది. మహారాష్ట్రలో 8వేలకు పైగా ధర ఉందని, ఇక్కడ కూడా పెంచాలని రైతులు పట్టుపట్టారు. దాంతో మార్కెట్‌యార్డులోనే దాదాపు 2 గంటలకుపైగా రైతులు నిరసన వ్యక్తంచేశారు. కలెక్టర్ సముదాయించినా వినకపోవడంతో మరో రూ.50 పెంచి క్వింటాల్ ధర రూ.7,970 గా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. తీరా మార్కెట్ యార్డులో ఒకసారి, జిన్నింగ్ మిల్లులో మరోసారి మాయిష్చర్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడర్స్ చెప్పడంతో మరో వివాదం మొదలైంది. జిన్నింగ్‌మిల్లులో టెస్ట్ చేయడమంటే కొర్రీలు పెట్టి, డబ్బులు కట్‌చేయడమేనని రైతులు వాదించారు. ఒకేసారి టెస్ట్ చేసి దాని ఆధారంగానే కొనుగోళ్లు జరపాలని రైతులు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు కిసాన్ చౌక్‌లో ధర్నా చేశారు. ఆపీసర్లు ఎంత సముదాయించినా రైతులు వినలేదు. ముందుగా ప్రకటించిన ధరతో అమ్మేందుకు కొందరు రైతులు ముందుకు రావడంతో పోలీసులు దగ్గరుండి కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రతి కొనుగోలులో మాయిష్చర్ 15 శాతానికి పైగానే వచ్చింది. అంటే ఒక్కో శాతానికి ఒక కిలో చొప్పున ధర తగ్గించగా సరాసరి రైతుకు క్వింటాల్‌కు రూ. 7365 ధర దక్కింది.
ఏనుమాములలో క్వింటాల్ పత్తికి రూ.7.900లు
వరంగల్ సిటీ/ మహబూబాబాద్, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం మెరిసింది. సోమవారం ఇక్కడికి సుమారు 15వేల పత్తి బస్తాలు వచ్చాయి. గరిష్టంగా క్వింటాల్ పత్తికి రూ.7.900ల పలికితే..కనిష్టంగా రూ.6వేలు రేటు వచ్చింది. మహబూబాబాద్ అగ్రికల్చర్ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7906 వరకు పలికింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధర రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.