ఆట అదుర్స్..​ ​హున్సాలో కొనసాగిన పిడి గుద్దుల ఆట

 ఆట అదుర్స్..​ ​హున్సాలో కొనసాగిన పిడి గుద్దుల ఆట
  • ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్న  గ్రామస్తులు, పోలీసులు 

బోధన్​, వెలుగు : సాలూర మండలంలోని హున్సా గ్రామంలో శుక్రవారం  పీడీగుద్దుల ఆట ఆసక్తిగా సాగింది. కంప్యూటర్ యుగంలోనూ  పురాతన క్రీడలు ఆడడం విశేషం.  పోలీసులు ఎన్ని అంక్షలు విధించినా ఆటను 10 నిమిషాలు ఆడి చూపరులను ఆనందింపజేశారు.  ఈఆటలో ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో కొట్టుకున్నారు. నిజామాబాద్​ జిల్లావాసులే కాకుండా  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి  జనం తండోపతండాలుగా వచ్చి ఆటను తిలకించారు. 

ఆట తీరు ఇలా....

గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు.  గ్రామం మధ్యలోని చావిడి వద్ద  ఖాళీ స్థలంలో రెండు వైపులా కట్టెలు పాతారు. రెండు కట్టెల మధ్య బలమైన తాడును  కట్టారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసి,  గ్రామపెద్దలు బాజభజంత్రీలతో ఆటను ప్రారంభించారు.  తాడుకు ఇరువైపులా రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు.  చేతులతో ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో కొట్టుకున్నారు. సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఆట సాగింది.  ముఖం, చేతులు, వీపుపై పిడి గుద్దులతో కొట్టుకున్నారు.  ఆనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ సంబురాలు చేసుకున్నారు. 

ఆట నిర్వహించకపోతే గ్రామానికే అరిష్టం

హోలీ రోజు ఆట నిర్వహించకపోతే గ్రామానికే అరిష్టమని గ్రామస్తుల నమ్మకం.   పిడి గుద్దుల ఆటకు ముందుగా కుస్తీ పోటీలు నిర్వహించారు.  వేరే ప్రాంతాల్లో స్థిరపడినవారు కచ్చితంగా హోలీ రోజున గ్రామానికి చేరుకుంటారు. ప్రతి ఇల్లు ఆడపడుచులు, బంధుమిత్రులతో కళకళాలాడింది. 

కుస్తీ పోటీల జాతర ఏర్పాట్లు 

పిడి గుద్దులాట సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు.  కుస్తీ పోటీల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా మహారాష్ట నుంచి మల్లయోధులు తరలివచ్చారు.  గ్రామంలో జాతర ఏర్పాట్లు చేశారు. 

పోలీసుల బందోబస్తు 

బోధన్ రూరల్​ సీఐ విజయబాబు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పిడి గుద్దులాట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఈ బందోబస్తులో సివిల్ పోలీసులతో పాటుగా స్పెషల్​ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.