
- రూ లక్షలు ఖర్చుపెట్టారు.. పర్యవేక్షణ మరిచారు..
- ఏర్పాటు చేసిన రెండేండ్లకే మూలన పడిన సిగ్నల్స్
- అస్తవ్యస్తంగా ట్రాఫిక్.. ఇబ్బందుల్లో వాహనదారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతోపాటు పాల్వంచలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేక, ఉన్నవి సరిగా పని చేయక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్సరైన పర్యవేక్షణ లేక రెండేండ్లకే మూలన పడ్డాయి. పోలీస్, మున్సిపాలిటీ శాఖల మధ్య సమన్వయ లోపంతో అవి రిపేర్లకు నోచుకోక ప్రజలకు పాట్లు తప్పడం లేదు.
ఇదీ.. పరిస్థితి..
రెండేండ్ల కిందట మొదటి దశలో రూ. 15లక్షలతో కొత్తగూడెంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పోస్టాఫీస్, బస్టాండ్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. రెండో దశలో సూపర్‌బజార్, గణేశ్ టెంపుల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఆ తర్వాత మరిచిపోయారు. ప్రస్తుతం సిగ్నల్స్ ఉండి పనిచేయనిచోట, పూర్తిగా సిగ్నల్స్ లేని చోట ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. తరుచూ రిపేర్లకు గురవుతుండడంతో వాటిని పట్టించుకోవడమే మరిచారు. దాంతో అవి పూర్తిగా పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో అడ్డదిడ్డంగా వెళ్తున్న వహనదారులను అధికారులు ఫొటోలు తీసి ఫైన్స్లు వేస్తున్నారు తప్ప సమస్యను చక్కదిద్దడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పాల్వంచలో అదే పరిస్థితి..
పాల్వంచలో గతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పాడవడంతో వాటిని పోలీసులు తొలగించారు. కేటీపీఎస్, ఎన్టీపీసీతో పాటు కిన్నెరసాని, ప్రస్తుతం కలెక్టరేట్ సముదాయం పాల్వంచలోనే ఉండడంతో రద్దీ పెరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
శాఖల మధ్య సమన్వయ లోపం..
పోలీస్, మున్సిపాలిటీ శాఖల మధ్య సమన్వయం లోపంతోనే ఈ పరిస్థతి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షించే బాధ్యత మున్సిపాలిటీలదంటూ పోలీసులు పేర్కొంటున్నారు. తాము ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని పోలీసులు సరిగా మెయింటేయిన్ చేయడంలేదని మున్సిపల్ ఆఫీసర్లు అంటున్నారు.
ALSO READ : ఇసుక దందాకు చెక్.. సీఎం వార్నింగ్‌తో కదిలిన అధికారయంత్రాంగం
ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందిగా ఉంది..
కొత్తగూడెంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. సిగ్నల్స్ ఉన్నా పని చేయడం లేదు. పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోలో చేయడం కన్నా వాహనాలను ఫొటోలు తీసేందుకే ఇంట్రస్ట్చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సిగ్నల్స్‌ను రిపేరు చేయించాలి.- రాజేశ్‌కుమార్, స్థానికుడు, కొత్తగూడెం
మున్సిపల్ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం
కొత్తగూడెం, పాల్వంచలో ట్రాఫిక్ సిగ్నల్స్ కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న వాటిని రిపేర్ చేయాలని మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లాం. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశాం. సమస్యను తర్వగా పరిష్కరించేలా చూస్తాం. - బి.రోహిత్ రాజు, ఎస్పీ, భద్రాద్రికొత్తగూడెం
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం..
కొత్తగూడెంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని ఇటీవల పోలీసులు తమ దృష్టికి తెచ్చారు. ఉన్న వాటిని రిపేర్ చేయడంతో పాటు కొత్తగా కొన్ని చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. శేషాంజన్ స్వామి, కమిషనర్, కొత్తగూడెం మున్సిపాలిటీ