ఖైరతాబాద్ బడా గణేశ్పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం నుంచి ఈ నెల 17న నిమజ్జనాలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కొన్ని రోడ్లను పూర్తిగా క్లోజ్చేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత వాహనాలపై దర్శనానికి వచ్చే భక్తులు నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు నుంచి మాత్రమే రావాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్గార్డెన్పక్కన ఉన్న 125 అడుగుల అంబేద్కర్‌విగ్రహం పక్కన పార్కింగ్సౌకర్యం కల్పించారు. ఖైరతాబాద్, రాజీవ్ గాంధీ స్టాచ్యూ రోడ్, రాజ్‌దూత్ లేన్ రూట్లలో అనుమతి లేదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సహాయం కోసం 90102 03626కు కాల్ చేయొచ్చని సూచించారు.
దర్శనానికి మూడు దారులు
ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్మహా గణపతి దర్శనం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. శనివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి తొలిపూజ చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ఇలా వెళ్లాలి.. అలా రావాలి
– ఖైరతాబాద్ రైల్వే గేటు నుంచి వచ్చేవారు నేరుగా ఎడమ వైపు బారికేడ్ల నుంచి వెళ్లి వినాయకుడిని దర్శించుకుని ఐమాక్స్ థియేటర్ లేదా మింట్‌కాంపౌండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
– -మింట్‌కాంపౌండ్ నుంచి వచ్చేవారు ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం, గజ్జలమ్మ దేవాలయం, వార్డు ఆఫీస్, ప్రభుత్వ దవాఖాన ముందు నుంచి లైన్లో వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మింట్‌కాంపౌండ్ వైపే వెళ్లాల్సి ఉంటుంది.
– లక్డీకాపూల్, సెన్సేషన్ థియేటర్ వైపు నుంచి వచ్చేవారు రాంరెడ్డి చికెన్‌సెంటర్ మీదుగా వచ్చి కార్నర్‌నుంచి దర్శించుకుని ఎడమవైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వైపు బయటకు రావాలి.
మూడు షిఫ్టుల్లో డ్యూటీలు
భక్తుల భద్రత కోసం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, -13 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది ఎస్సైలు, 22 ప్లాటూన్ల సిబ్బంది 3 షిఫ్టుల్లో డ్యూటీలు చేయనున్నారు. 40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగించనున్నారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే ప్రాంతాలు
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఐమ్యాక్స్పార్కింగ్వరకు వెళ్లొచ్చు. మింట్‌కాంపౌండ్‌వైపు వాహనాలకు అనుమతి లేదు.
- ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వెహికల్స్‌ను రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరంకారీ జంక్షన్ వైపు నుంచి మళ్లిస్తారు.
- ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రాజ్‌దూత్ లేన్‌లో బడా గణేశ్వైపు నో ఎంట్రీ. ఇక్బాల్ మినార్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేస్తారు.
- ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్ వద్ద తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఎన్‌టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్స్ నుంచి మింట్ కంపౌండ్ వైపు నో ఎంట్రీ, నెక్లెస్ రోటరీ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు దారి మళ్లిస్తారు.
- నిరంకారీ ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు నో ఎంట్రీ. వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్ మీదుగా డైవర్ట్ చేస్తారు.
వాహనాలకు పార్కింగ్ : ఐమాక్స్ పక్కన అంబేద్కర్ స్క్వేర్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, సరస్వతి విద్యామందిర్, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ఏరియాలు.