ఎస్కార్ట్ తో డీసీఎంలో.. మూగజీవాల అక్రమ రవాణా

ఎస్కార్ట్ తో డీసీఎంలో.. మూగజీవాల అక్రమ రవాణా
  • ఓ చానల్ రిపోర్టర్​తో  పాటు  ఐదుగురిపై కేసు
  • కారు, డీసీఎం, 22  పశువులు స్వాధీనం

ఏటూరు నాగారం, వెలుగు: మీడియా ముసుగు లో ఇసుక, ఆవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఎస్ఐ తాజుద్దీన్​ తెలిపిన ప్రకారం... ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన  శ్రీను అనే వ్యక్తి  ఓ చానల్ రిపోర్టర్. ఇతను సెల్ షాప్ నిర్వహిస్తుండడమే కాకుండా.. కొంతకాలంగా  మూగ జీవాల అక్రమ రవాణా కొనసాగిస్తున్నాడు. 

డీసీఎంలో రాత్రిపూట మూగ జీవాలను తరలిస్తుండడంతో పాటు తన కారును ఎస్కార్ట్ గా వినియోగిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున డీసీఎంకు ఎస్కార్ట్ గా కారు స్పీడ్ గా వస్తుండడంతో సమాచారం మేరకు ఆపి తనిఖీ చేయగా మూగజీవాలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  శ్రీనుతో పాటు మండలంలోని దొడ్ల కొత్తూరుకు చెందిన జైస్లావత్ కుమార్, మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఆత్కూరి రవీందర్, ములుగు మండలం జంగాలపల్లికి చెందిన కొడాలి కృష్ణ, శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

కారు( ఏపీ16సీఏ 3656), డీసీఎం (టీఎస్​12వీటీ 4046 ) సీజ్ చేసి.. 22 మూగజీవాలను గోశాలకు తరలించామని ఎస్ ఐ తాజుద్దీన్ తెలిపారు. మీడియా ముసుగులో కొందరు అక్రమాలకు పాల్పడితే  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ములుగు ఎస్పీ శబరీశ్  ​ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్ సూచనలతో ప్రత్యేక నిఘా పెట్టి మూగజీవాలు, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలపై తనిఖీలు చేపడుతున్నామన్నారు.