
- ఇద్దరు నర్సింగ్ స్టూడెంట్స్ మృతి, మరో ఐదుగురికి గాయాలు
- న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన నర్సింగ్ విద్యార్థులు
గద్వాల,వెలుగు: గద్వాల పట్టణంలో పానీ పూరి బండిపైకి బొలెరో వెహికల్ దూసుకురావడంతో ఇద్దరు నర్సింగ్ స్టూడెంట్లు స్పాట్ లోనే చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. గద్వాల పాత ఎస్పీ ఆఫీసులో నర్సింగ్ కాలేజీని నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కాలేజీ వదలగానే స్టూడెంట్లు కర్నూల్, గద్వాల రహదారి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం పానీపూరి బండి దగ్గర వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో జమ్ములమ్మ వైపు నుంచి వేగంగా వచ్చిన బొలెరో వెహికల్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నర్సింగ్ కాలేజీకి చెందిన మహేశ్వరి(20), మనీషా శ్రీ(20) స్పాట్ లోనే చనిపోయారు. ప్రణీత అనే స్టూడెంట్ కు తీవ్ర గాయాలయ్యాయి. పానీపూరి తినేందుకు వచ్చిన భువనగిరికి చెందిన చరణ్ భూపాల్, సంగారెడ్డికి చెందిన నితిన్ గోపాల్, గద్వాలకు చెందిన వెంకటేశ్, పానీ పూరి బండి నడిపించే మంగళ్ బగల్ కు గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న బొలెరో డ్రైవర్ వేగంగా వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ముందుగా పల్సర్ బైక్‌ను ఢీకొందని, ఆ తర్వాత కరెంట్ పోల్‌ను ఢీకొనడంతో పోల్ విరిగిపోయింది. పానీపూరి బండి బోల్తా పడగా, అక్కడున్న వారు చెల్లాచెదురుగా పడిపోయారు. బొలెరో కరెంట్ పోల్‌ను ఢీకొని ఆగకపోతే మరిన్ని ప్రాణాలు పోయేవని
అంటున్నారు.
స్టూడెంట్ల రాస్తారోకో..
ప్రమాదంలో చనిపోయిన స్టూడెంట్లకు న్యాయం చేయాలని నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు రాస్తారోకో చేశారు. అన్యాయంగా ప్రాణాలు తీశారంటూ రోదించారు. న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటాం అంటూ నినాదాలు చేశారు. కాలేజీ లెక్చరర్లు వారికి నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.
బాధితులకు పరామర్శ..
యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాస్పిటల్ కు తరలివచ్చారు. గాయపడ్డ వారిని పరామర్శించి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. యాక్సిడెంట్ విషయాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్లు ఫోన్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.