ఎక్స్ ట్రా చార్జీలు వసూలుచేస్తే బస్సులు సీజ్ చేస్తం : మంత్రి పొన్నం

  • ప్రైవేట్  ట్రావెల్స్ సంస్థలకు మంత్రి పొన్నం హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ పేరుతో ప్రయాణికుల వద్ద అదనపు చార్జీలు వసూలు చేస్తే  బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్  ట్రావెల్స్  సంస్థలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హెచ్చరించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రద్దీని అవకాశంగా చేసుకుని ఎక్స్ ట్రా చార్జీల పేరుతో దోపిడీ చేస్తామంటే కుదరదని, ఈ విషయంలో ఎవరినీ ఊపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. బస్సులను సీజ్  చేయడమే కాకుండా బాధ్యులపై  చట్టపరంగానూ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రైవేట్  ట్రావెల్స్  యజమానులు ఎవరైనా అదనపు చార్జీలు వసూలు చేసినట్లయితే రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. అధికారులు ఫీల్డ్ లోనే ఉంటూ నిరంతరం తనిఖీలు  చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి బస్సులను సీజ్ చేయాలన్నారు. ప్రయాణికుల భద్రత, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని వీలైనన్ని అదనపు బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.