సంఘాల నేతలు, ముఖ్యులను మీటింగ్ కు పిలుస్తం: సీఎం రేవంత్రెడ్డి
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సీఎంను కలిసిన ఆదిలాబాద్ ఆదివాసీలు
హైదరాబాద్, వెలుగు : ఆదివాసీల సమస్యలపై దీపావళి లోపు సెక్రటేరియెట్ లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ సమావేశానికి ఆదివాసీ సంఘాల నేతలు, ముఖ్యులను ఆహ్వానించి.. వారి డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదిలాబాద్ కలెక్టర్ గా పనిచేసి, అక్కడి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న సెర్ప్ సీఈవో, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ను అక్కడికి పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆదివాసీలు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జైనూరు ఘటనతో ఆదివాసీలు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరువర్గాలతో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. అయితే, స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వారు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని ఆదివాసీలు సీఎంను కోరారు.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయించిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆత్రం సుగుణకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.