
- 20 కిలోమీటర్లు నడిచొచ్చి ఐటీడీఏ ఆఫీస్ ఎదుట ధర్నా
వెంకటాపురం, వెలుగు : గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు గిరిజనులు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గుడిసెలవాసులు సుమారు 20 కిలోమీటర్లు నడిచి ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీస్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గూడేల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.
కానీ ఇప్పటివరకు తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సార్లు వినతిపత్రాలు అందజేసిన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరిస్తామని పీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జిల్లా కార్యదర్శి సాంబశివ, మండల కార్యదర్శి కొప్పుల తిరుపతి, జజ్జరి దామోదర్, దుగ్గి చిరంజీవి, రాజేశ్ పాల్గొన్నారు.