ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం.. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం.. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ నుంచి 15 రోజుల పాటు ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో గవర్నర్ పీఏ నర్సింహ స్టేట్మెంట్ను జూబ్లీహిల్స్ పోలీసులు రికార్డు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఇంద్రసేనారెడ్డి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఆయన పీఏ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.

ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్గా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఫోన్​ ట్యాపింగ్కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్​ చీఫ్​ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో గుట్టు బయట పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాకర్​రావును ఈ కేసులో ప్రధాన నిందితుడి(ఏ1)గా పోలీసులు చేర్చారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని విచారణలో దర్యాప్తు అధికారులకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వెల్లడించారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు, ప్రభాకర్ రావు నుంచి అందిన ఫోన్​ నంబర్ల ఆధారంగా ట్యాపింగ్ చేసేవాళ్లమని తెలిపారు. వందల సంఖ్యలో ఫోన్ నంబర్స్ అందేవని చెప్పారు.

అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల పరిసరాల్లో ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫోన్‌‌ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్‌‌రావుకు అందించేవాళ్లమని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే  ప్రభాకర్‌‌రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైజ్లు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఈ ముగ్గురూ విచారణలో అంగీకరించినట్టు పోలీసులు ఇప్పటికే పేర్కొన్నారు.