హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను కేటగిరీ వైజ్‌గా డివైడ్ చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్‌మెంట్ల సంఘం ప్రతినిధులు కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ట్రస్మా చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి జయసింహాగౌడ్ తదితరులు కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.50 వేల లోపు ఫీజులున్న బడ్జెట్ స్కూళ్లను డిస్ట్రిక్ట్ రెగ్యులేటరీ కమిటీ (డీఆర్సీ) కిందికి తీసుకురావొద్దని కోరారు. బడుల్లో టీసీ, ఎన్వోసీ లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దన్నారు. యూడైస్ ప్లస్ లో విద్యార్థిని తొలగించే అధికారం స్టేట్ అధికారులకే ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నోటీస్ బోర్డులో పెట్టిన ఫీజులను మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఏటా 15 శాతం ఫీజు పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు.