ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్కాలేజీల ఫీజులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తరువాత జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన చట్టాన్ని చేయనున్నట్టు తెలిసింది.
ప్రతి ఏడాది ఫీజులను పెంచుతూ బెంబేలెత్తిస్తున్న స్కూళ్ల యాజమాన్యాలు.. కొత్త అకడమిక్ ఇయర్ లో మళ్లీ ఎంతమేర ఫీజులు పెంచుతాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 11 వేలకు పైచిలుకు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఉండగా, వీటిలో దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగుతున్నది. ప్రైవేట్స్కూళ్లు ప్రతి ఏటా 25 నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయి. స్కూళ్ల స్థాయి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంచుతున్నారు.
ఆఖరికి పుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతున్నారు. వాస్తవానికి స్కూళ్ల పరిధిలో ఇవి అమ్మకూడదనే ప్రభుత్వ నిబంధన ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాలు ఫీజుల నియంత్రణపై ఇప్పటికే చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర 15 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. రాజస్థాన్‌లో ఫీజులు ఖరారు చేసేందుకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని 3 కమిటీలను ఏర్పా టు చేసి ఫీజులను ఖరారు చేస్తున్నారు. ఏపీలో స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు మూడేండ్లకుగాను ఒకసారి ఫీజులను ఖరారుచేసి అమలుపరుస్తున్నారు. గుజరాత్‌లో 2017-18 సంవత్సరం నుంచి నిర్దిష్ట ఫీజు విధానం కొనసాగుతున్నది. రాష్ర్టాన్ని నాలుగు జోన్లుగా విభజించి స్కూళ్లవారీగా ఫీజులను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
ఈ రాష్ట్రాల్లోని చట్టాలపై అధ్యయనం చేసి, కొత్త చట్టాన్ని రూపొందించేందుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతున్నది. ప్రతి ఏటా కొంత ఫీజు పెంచుకునే వెసులుబాటు చట్టంలో ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కత్తెర వేయనున్నారు. ఫీజు ఎంతనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా యాజమాన్యాలదేనని, అదే సమయంలో వాటిని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు పలు కేసుల్లో స్పష్టంచేసింది. అంటే ఫీజుకు తగ్గట్టు వసతులు, విద్యా బోధన ఉందా? లేదా? అని తనిఖీ చేసి ఎక్కువ ఫీజు ఉంటే తగ్గించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్ర సర్కారు క్యాటగిరీల వారీగా నియంత్రణ ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్టు తెలిసింది.
కమిటీ సిఫారసులు కాగితాలకే పరిమితం చేసిన గత సర్కార్
ఫీజుల నియంత్రణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని నియమించింది. ఆ కమిటీ 2017 డిసెంబరులో నివేదిక సమర్పించింది. ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని, అంతకంటే ఎక్కువ పెంచుకోవాలంటే కమిటీకి ఆదాయ, వ్యయాలు సమర్పించి, అనుమతి తీసుకోవాలని సూచించింది. అయితే, అది కాగితాలకే పరిమితమైంది. 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో 11 మంది మంత్రులతో ఫీజు నియంత్రణకు విధివిధానాలు రూపొందించేందుకు గత సర్కారు ఉప సంఘాన్ని నియమించింది. ఈ కమిటీ కూడా ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్‌లో 10 శాతానికి మించి ఫీజు పెంచేందుకు వీలులేదని సిఫారసులు చేసింది. వీటిపై ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి.. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదు.