హైదరాబాద్, వెలుగు: సాగర్ ఎడమ కాల్వ రిపేర్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర సర్కారు అధికారులను ఆదేశించింది. పంటలకు నీళ్లివ్వాల్సి ఉండటంతో వీలైనంత వేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. ఈ నేపథ్యంలోనే రిపేర్లకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో ఓ చోట సాగర్కాల్వకు గండి పడటంలో మరో రెండు చోట్ల గండి పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వాటి రిపేర్లకు రూ.9.43 కోట్లను విడుదల చేస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేటలోని సాగర్ ఎడమ కాల్వకు 140.540 కిలోమీటర్ నుంచి 140.690 కిలోమీటర్ మధ్య పడిన గండిని పూడ్చేందుకు, 140.220 కిలోమీటర్ నుంచి 140.385 కిలోమీటర్, 140.385 కిలోమీటర్ నుంచి 140.540 కిలోమీటర్ వరకు కాల్వ కుడివైపు కట్టను పటిష్ఠం చేసేందుకు రూ.5,14,50,000ను మంజూరు చేశారు. జుజ్జులరావుపేటలోనే 140.030 కిలోమీటర్ నుంచి 140.110 వరకు, 140.150 నుంచి 140.200 వరకు, 140.260 నుంచి 140.550 వరకు కాల్వ గట్లను పటిష్ఠపరిచేందుకు, 140.110 నుంచి 140.150, 140.550 నుంచి 140.600 మధ్య పడిన గండిని పూడ్చేందుకు రూ.2,21,00,000ను విడుదల చేశారు. ఖమ్మం జిల్లా నాయకునిగూడెం వద్ద సాగర్ ఎడమ కాల్వ 133.600 కిలోమీటర్ నుంచి 133.730 కిలోమీటర్ మధ్య పడిన గండిని పూడ్చేందుకు రూ.2,07,50,000 మంజూరు చేశారు. వీలైనంత త్వరగా ఆయా పనులను పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.