
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- వరదలతో దెబ్బతిన్న కాలువల రిపేర్లు వేసవిలోపు పూర్తి చేయాలని ఎన్ఎస్పీ సీఈకి ఆదేశం
ఖమ్మం టౌన్, వెలుగు : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ ఆధునీకరణ, రిపేర్లు, తదితర అంశాలపై ఆదివారం ఎన్ఎస్పీ సీఈ రమేశ్‌బాబు తో మంత్రి మాట్లాడారు. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదలతో కాలవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మే ఆఖరి వరకు కాలువల రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు భూములకు సైతం నీరందించేలా పటిష్ట ప్రణాళికలతో ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. బీడు భూముల లేని తెలంగాణగా మార్చేందుకు
శ్రమిస్తున్నామని చెప్పారు.
వేద పాఠశాలల ఏర్పాటు గొప్ప పని
సత్తుపల్లి : వేద పాఠశాలల ఏర్పాటు గొప్ప విషయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బుగ్గపాడులో ఉన్న శ్రీ విశ్వ ధర్మ క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తున్నందున నిర్వాహకుడు రామడుగు ప్రసాదాచారిని అభినందించారు. అంతకుముందు విశ్వ ధర్మక్షేత్రంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు చల్లగుల్ల నరసింహారావు పాల్గొన్నారు.