గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తా : తుమ్మల నాగేశ్వరరావు

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తల్లాడ, వెలుగు: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి రైతుల రుణం తీర్చుకుంటానని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం తల్లాడ మండలం గంగదేవిపాడులో నాబార్డు నిధులతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం భవనం, గోడౌన్​ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కృష్ణా జలాలు రాని పరిస్థితిల్లో గోదావరి నీటితో సాగునీరు అందించాలని ఎత్తిపోతల ద్వారా జలాలు తీసుకొస్తున్నామని చెప్పారు.

 రాబోయే సంవత్సరంలో కృష్ణా జలాలు రావడం ఆలస్యమైనా గోదావరి నీటితో రైతులకు సాగు నీరందిస్తామన్నారు. తొలి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12వేలు రైతుల ఖాతాలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, జాజి, వక్క లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు.

సంఘం ద్వారా అవసరమైన మౌలిక వసతులు గోడౌన్, పనిముట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ ఖరీఫ్ పంట నుంచి ప్రతి పంటకు బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు తల్లాడ మండలం బిల్లుపాడులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కంపూడి కృష్ణమూర్తి ఇటీవల మృతిచెందగా ఆయన విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

నైపుణ్యం గల టీచర్లను తయారు చేయాలి

ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యం గల టీచర్లను తయారు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 7వ డివిజన్ టేకులపల్లిలో ఆయన పర్యటించారు. అడిషనల్​ కలెక్టర్ శ్రీజతో కలిసి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల  కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ70 ఏండ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేకపోయామన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 11 వేలకు పైగా టీచర్​ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు.

డైట్ కళాశాల కాంపౌండ్ గ్రీనరీ తో ఆహ్లాదకరంగా ఉండేలా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సత్యనారాయణ, డీఈవో సోమశేఖరశర్మ, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ  రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.